ఉక్రెయిన్‌లో వేగంగా మారుతున్న ప‌రిస్థితులు.. దౌత్య కార్యాలయాన్ని తాత్కాలికంగా మార్చేందుకు సిద్ధమైన‌ భారత్..!

India to temporarily relocate embassy from Ukraine to Poland amid Russian advance. రష్యా సైనిక దాడితో ఉక్రెయిన్‌లో దెబ్బతిన్న దేశ భద్రతా పరిస్థితుల‌ దృష్ట్యా.. ఆ దేశంలోని భార‌త‌

By Medi Samrat  Published on  13 March 2022 2:27 PM GMT
ఉక్రెయిన్‌లో వేగంగా మారుతున్న ప‌రిస్థితులు.. దౌత్య కార్యాలయాన్ని తాత్కాలికంగా మార్చేందుకు సిద్ధమైన‌ భారత్..!

రష్యా సైనిక దాడితో ఉక్రెయిన్‌లో దెబ్బతిన్న దేశ భద్రతా పరిస్థితుల‌ దృష్ట్యా.. ఆ దేశంలోని భార‌త‌ రాయబార కార్యాలయాన్ని పోలాండ్‌కు తాత్కాలికంగా మార్చాలని కేంద్రం నిర్ణయించింది. రాజధాని కైవ్‌తో సహా కీలకమైన ఉక్రెయిన్ నగరాలు, పట్టణాలను రష్యా దళాలు మూసివేస్తున్నందున ఈ నిర్ణయం తీసుకుంది. ఉక్రెయిన్‌లో వేగంగా క్షీణిస్తున్న భద్రతా పరిస్థితుల దృష్ట్యా.. దేశంలోని పశ్చిమ ప్రాంతాలలో దాడుల నేఫ‌థ్యంలో.. ఉక్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయాన్ని తాత్కాలికంగా పోలాండ్‌కు మార్చాలని నిర్ణయించామ‌ని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. తదుపరి పరిణామాల మేర‌కు పరిస్థితిని తిరిగి అంచనా వేయబడుతుందని ఒక‌ సంక్షిప్త ప్రకటనలో తెలిపింది.

కైవ్‌లోని భారత రాయబార కార్యాలయంలోని అధికారులు.. గత కొన్ని రోజులుగా ఎల్వివ్‌లోని దాని క్యాంపు కార్యాలయం నుండి ఇప్పటికే పని చేస్తున్నారు. ల్యాండ్ బోర్డర్ క్రాసింగ్‌ల ద్వారా ఉక్రెయిన్ నుండి భారతీయ పౌరులను తరలించే ప్రయత్నాలలో భాగంగా ఎల్వివ్‌లో రాయబార కార్యాలయం యొక్క క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేయబడింది. ఎల్వివ్ పశ్చిమ ఉక్రెయిన్‌లోని ఓ నగరం.. ఇది పోలాండ్ సరిహద్దు నుండి 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇదిలావుంటే.. ఉక్రెయిన్‌లో యుద్ధం నేపథ్యంలో ఫిబ్రవరి 26న కేంద్రం ప్రారంభించిన 'ఆపరేషన్ గంగా' మిషన్ కింద ఉక్రెయిన్ అంతటా ఉన్న 18,100 మంది పౌరులను భారత్‌కు తీసుకువచ్చింది.

రష్యా సైనిక ఆపరేషన్ ప్రారంభించిన తర్వాత ఉక్రెయిన్ పౌర విమానాల కోసం తన గగనతలాన్ని మూసివేసిన నేఫ‌థ్యంలో.. ఉక్రెయిన్ భూ సరిహద్దు ప్రాంతాలైన‌ రొమేనియా, పోలాండ్, హంగేరి, స్లోవేకియా, మోల్డోవా రవాణా పాయింట్ల ద్వారా భార‌త్ త‌న పౌరుల‌ను స్వ‌దేశాల‌కు చేర్చింది.

ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న సంఘర్షణ నేపథ్యంలో భారతదేశం యొక్క భద్రతా సంసిద్ధత, ప్రస్తుత ప్రపంచ పరిస్థితులపై స‌మీక్షించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఆదివారం కేబినెట్ కమిటీ సమావేశం జ‌రిగింది. ఉక్రెయిన్‌లోని తాజా పరిణామాలపై మోదీకి వివరించామని.. అక్క‌డి నుండి భారత పౌరులతో పాటు పొరుగు దేశాలలోని కొంతమంది పౌరులను తరలించేందుకు చేపట్టిన ఆపరేషన్ గంగా విష‌య‌మై వివరాలతో సహా వివరించినట్లు తాజా అధికారిక ప్రకటన తెలిపింది.

Next Story