అత్యధిక జనాభా గల దేశంగా భారత్.. ఇంకా ఒక్క ఏడాదే.!
India to surpass China as most populous country in a year. ప్రపంచంలోనే అత్యధిక జనాభాను కలిగి ఉన్న దేశంగా భారత్ నిలవబోతోంది. ఇందుకు ఇంకా ఒక్క సంవత్సరం మాత్రమే
By అంజి Published on 12 July 2022 7:00 AM GMTప్రపంచంలోనే అత్యధిక జనాభాను కలిగి ఉన్న దేశంగా భారత్ నిలవబోతోంది. ఇందుకు ఇంకా ఒక్క సంవత్సరం మాత్రమే మిగిలి ఉంది. 2023 నాటికి చైనాను భారత్ దాటేస్తుందని యునైటెడ్ నేషన్స్ తాజా నివేదికలో వెల్లడిచింది. సోమవారం ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకొని '2022 ప్రపంచ జనాభా అంచనాలు' పేరుతో నివేదికను యునైటెడ్ నేషన్స్ రిలీజ్ చేసింది. ప్రస్తుతం చైనా జనాభా 146.6 కోట్లు, భారత్ జనాభా 141.2 కోట్లు ఉందని రిపోర్టులో తెలిపింది. 2023 నవంబర్ 15 నాటికి ప్రపంచ జనాభా 800 కోట్లకు చేరుకుంటుందని యూఎన్ అంచనా వేసింది.
జనాభా అంచనాల నివేదిక విడుదల సందర్భంగా యూఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటేరస్ మాట్లాడారు. ఈ ఏడాది ప్రపంచ జనాభాలో సరికొత్త మైలురాయిని అందుకోబోతున్నామన్నారు. ఈ భూమి మీద 800 కోట్లవ శిశువు పుట్టే ఛాన్స్ ఉందని, మన వైవిధ్యతను వేడుక చేసుకొనే సందర్భం ఇది అని పేర్కొన్నారు. హెల్త్ సెక్టార్‌లో గొప్పగా ఎదిగాం, హెల్త్ స్టాండర్డ్స్‌లో పురోగతి సాధిస్తున్నామని చెప్పారు. మాతా, శిశు మరణాలు రేటు బాగా తగ్గిందని, సగటు ఆయుర్దాయం పెరిగిందని వెల్లడించారు. ఇదే సమయంలో మన భూమిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందన్నారు.
2050 నాటికి భారత్ జనాభా 166.8 కోట్లకు చేరనుంది. 2035 నాటికి భారత్‌లో పట్టణ జనాబా 67.5 కోట్లకు చేరుకుంటుందని యూఎన్ అంచనా వేసింది. ది యునైటెడ్ నేషన్స్ హబిటాట్స్ వరల్డ్ సిటీస్ రిపోర్ట్-2022 ప్రకారం.. భారత్‌లో పట్టణ జనాభా 2025 నాటికి 54.2 కోట్లకు చేరుకుంటుంది. 2030 నాటికి 67 కోట్లకు చేరుకుంటుంది. 23.32 కోట్ల జనాభాతో భారత్‌లో అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రంగా యూపీ ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. అతి తక్కువ జనాభా ఉన్న రాష్ట్రంగా సిక్కిం (6.83 లక్ష లు) నిలిచింది.