28వ కామన్‌వెల్త్ స్పీకర్లు, ప్రిసైడింగ్ ఆఫీసర్ల సదస్సుకు భారత్ ఆతిథ్యం
28వ కామన్‌వెల్త్ స్పీకర్లు, ప్రిసైడింగ్ ఆఫీసర్ల సదస్సు (CSPOC)కు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది.
By - Knakam Karthik |
28వ కామన్‌వెల్త్ స్పీకర్లు, ప్రిసైడింగ్ ఆఫీసర్ల సదస్సుకు భారత్ ఆతిథ్యం
ఢిల్లీ: కామన్‌వెల్త్ దేశాల పార్లమెంటరీ వ్యవస్థలను బలోపేతం చేయాలనే లక్ష్యంతో నిర్వహించే 28వ కామన్‌వెల్త్ స్పీకర్లు, ప్రిసైడింగ్ ఆఫీసర్ల సదస్సు (CSPOC)కు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ సదస్సు జనవరి 14 నుంచి 16, 2026 వరకు ఢిల్లీలో జరగనుంది. ఈ అంతర్జాతీయ పార్లమెంటరీ సదస్సును జనవరి 15న పార్లమెంట్ సముదాయం లోని సంసిద్ధాన్ సదన్ సెంట్రల్ హాల్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ఆయన కీలక ప్రసంగం చేయనున్నారు.
ఈ సదస్సుకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షత వహిస్తున్నారు. కామన్‌వెల్త్‌కు చెందిన 53 దేశాల పార్లమెంట్ల స్పీకర్లు, ప్రిసైడింగ్ ఆఫీసర్లు ఈ సమావేశాల్లో పాల్గొననున్నారు. మొత్తం 229 మంది ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరుకానున్నారు. సదస్సులో పార్లమెంట్‌లో కృత్రిమ మేధ (AI) వినియోగం, సోషల్ మీడియా ప్రభావం, పౌరుల భాగస్వామ్యాన్ని పెంపొందించే వ్యూహాలు, ఎంపీల భద్రత, ఆరోగ్యం, సంక్షేమం వంటి కీలక అంశాలపై చర్చలు జరగనున్నాయి.
ప్రత్యేక ప్లీనరీ సమావేశంలో ప్రజాస్వామ్య సంస్థలను బలోపేతం చేయడంలో స్పీకర్ల పాత్రపై విస్తృతంగా చర్చించనున్నారు. సదస్సు ముగిసిన అనంతరం ప్రతినిధుల కోసం జైపూర్‌కు పోస్ట్-కాన్ఫరెన్స్ టూర్‌ను కూడా ఏర్పాటు చేశారు. భారత్ ఇంతకు ముందు 1971, 1986, 2010లో CSPOC సదస్సులను నిర్వహించింది. ఇది నాలుగోసారి భారత్ ఈ ప్రతిష్ఠాత్మక సదస్సుకు ఆతిథ్యం ఇవ్వడం విశేషం.