భారతదేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. గడిచిన 3 రోజుల నుండి లక్షకు పైగా కరోనా కేసులు నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. గత 24 గంటల్లో 1,79,723 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. ఇది నిన్నటితో పోలిస్తే 12.6% ఎక్కువ. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,57,07,727కి చేరింది. అత్యధిక కేసులు నమోదైన మొదటి ఐదు రాష్ట్రాలు మహారాష్ట్రలో 44,388 కేసులు, పశ్చిమ బెంగాల్‌లో 24,287 కేసులు, ఢిల్లీలో 22,751 కేసులు, తమిళనాడులో 12,895 కేసులు, కర్ణాటకలో 12,000 కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో దేశంలో 146 మరణాలు నమోదయ్యాయి, మొత్తం ఇప్పటి వరకు నమోదైన మరణాల సంఖ్య 4,83,936 కు పెరిగింది. రోజు వారి కేసులు పెరుగుతుండటంతో యాక్టివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుతం దేశంలో 7 లక్షల యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక రోజువారీ పాజిటీవి రేటు 13.29 శాతానికి చేరకుంది.
దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఓమిక్రాన్ కేసులు కూడా పెరుగుతున్నాయి. దేశ వ్యాప్తంగా 4,033 ఓమిక్రాన్ కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఓమిక్రాన్ సోకిన వారిలో 1552 మంది డిశ్చార్జి అయ్యారు. ఆదివారం నాడు ఒక్కరోజే దేశంలో 410 ఓమిక్రాన్ కేసులు బయటపడ్డాయి. అడిషనల్ కమీషనర్ ఆఫ్ పోలీస్ (క్రైమ్ బ్రాంచ్)తో సహా 300 మంది ఢిల్లీ పోలీసు సిబ్బందికి కోవిడ్ -19 పాజిటివ్ అని అధికారులు సోమవారం తెలిపారు. "300 మందికి పైగా పోలీసు సిబ్బందికి వ్యాధి సోకింది. వారు వివిధ విభాగాలకు చెందినవారు. నిర్బంధంలో ఉన్నారు" అని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.