అణు కేంద్రాలు, ఖైదీల వివరాలను పరస్పరం మార్పిడి చేసుకున్న భారత్ - పాక్
భారత్ - పాకిస్థాన్ మధ్య 2008 కాన్సులర్ యాక్సెస్ ద్వైపాక్షిక ఒప్పందం ప్రకారం, ఇరు దేశాలు దౌత్య మార్గాల ద్వారా ఖైదీల జాబితాలను పరస్పరం మార్పిడి..
By - అంజి |
అణు కేంద్రాలు, ఖైదీల వివరాలను పరస్పరం మార్పిడి చేసుకున్న భారత్ - పాక్
భారత్ - పాకిస్థాన్ మధ్య 2008 కాన్సులర్ యాక్సెస్ ద్వైపాక్షిక ఒప్పందం ప్రకారం, ఇరు దేశాలు దౌత్య మార్గాల ద్వారా ఖైదీల జాబితాలను పరస్పరం మార్పిడి చేసుకున్నాయి. న్యూఢిల్లీలో మరియు ఇస్లామాబాద్‌లో ఒకేసారి ఈ ప్రక్రియ జరిగింది.
భారత్ తన కస్టడీలో ఉన్న పాకిస్థాన్‌కు చెందిన లేదా పాకిస్థాన్‌కు చెందినవారిగా భావిస్తున్న 391 మంది పౌర ఖైదీలు, 33 మంది మత్స్యకారుల వివరాలను పంచుకుంది. అదే విధంగా, పాకిస్థాన్ తన కస్టడీలో ఉన్న భారత్‌కు చెందిన లేదా భారత్‌కు చెందినవారిగా భావిస్తున్న 58 మంది పౌర ఖైదీలు, 199 మంది మత్స్యకారుల జాబితాను భారత్‌కు అందించింది.
పాకిస్థాన్ కస్టడీలో ఉన్న భారత పౌర ఖైదీలు, మత్స్యకారులు (వారి పడవలతో సహా), అలాగే గల్లంతైన భారత రక్షణ సిబ్బందిని త్వరితగతిన విడుదల చేసి స్వదేశానికి పంపించాలని భారత ప్రభుత్వం కోరింది. శిక్ష పూర్తిచేసుకున్న 167 మంది భారత మత్స్యకారులు, పౌర ఖైదీల విడుదలను వేగవంతం చేయాలని కూడా పాకిస్థాన్‌ను భారత్ కోరింది. అదనంగా, ఇప్పటివరకు కాన్సులర్ యాక్సెస్ అందని భారత్‌కు చెందినవారిగా భావిస్తున్న 35 మంది ఖైదీలకు తక్షణ కాన్సులర్ యాక్సెస్ కల్పించాలని పాకిస్థాన్‌ను అభ్యర్థించింది.
2014 నుంచి భారత ప్రభుత్వ నిరంతర కృషి ఫలితంగా, పాకిస్థాన్ నుంచి ఇప్పటివరకు 2,661 మంది భారత మత్స్యకారులు, 71 మంది భారత పౌర ఖైదీలు స్వదేశానికి తిరిగి వచ్చారు. ఇందులో 2023 నుంచి ఇప్పటివరకు 500 మంది మత్స్యకారులు, 13 మంది పౌర ఖైదీలు విడుదలయ్యారు.
అలాగే అణు కేంద్రాల వివరాలను ఇరు దేశాలు పంచుకున్నాయి. అణు కేంద్రాల వివరాల మార్పిడి అనేది 1988 డిసెంబర్ 31న కుదిరిన ద్వైపాక్షిక ఒప్పందం ఆధారంగా జరుగుతోంది. 1991 జనవరి నుంచి అమల్లోకి వచ్చిన ఈ ఒప్పందం ప్రకారం, ఒకరి అణు స్థావరాలపై (Nuclear Facilities) మరొకరు దాడులు చేసుకోకూడదు. ఈ రక్షణ చర్యలో భాగంగా ప్రతి ఏటా జనవరి 1న అణు కేంద్రాల వివరాలను పంచుకోవడం ఆనవాయితీగా వస్తోంది.