దేశంలో తీవ్రమైన చలి..ఈ రాష్ట్రాలకు ఐఎండీ కోల్డ్ వేవ్ వార్నింగ్
ఉత్తర, మధ్య భారతదేశం ప్రస్తుతం తీవ్రమైన శీతల వాతావరణంతో వణికిపోతోంది
By - Knakam Karthik |
దేశంలో తీవ్రమైన చలి..ఈ రాష్ట్రాలకు ఐఎండీ కోల్డ్ వేవ్ వార్నింగ్
ఉత్తర, మధ్య భారతదేశం ప్రస్తుతం తీవ్రమైన శీతల వాతావరణంతో వణికిపోతోంది. రానున్న రెండు రోజుల పాటు కోల్డ్ వేవ్ తీవ్రంగా కొనసాగి, ఆ తర్వాత క్రమంగా తగ్గే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఉత్తర, పశ్చిమ రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్, ఢిల్లీ ప్రాంతాల్లో చలి మరింత తీవ్రరూపం దాల్చే అవకాశముంది అని భారత వాతావరణ శాఖ (IMD) ధృవీకరించింది.
హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా, చండీగఢ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్, రాజస్థాన్‌తో పాటు ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఒడిశాలో కూడా ఈ పరిస్థితులు కొనసాగే అవకాశముందని వెల్లడించింది. హర్యానాలోని హిసార్ పట్టణంలో కనీస ఉష్ణోగ్రత 0.2 డిగ్రీల సెల్సియస్కు పడిపోయింది. జనవరి 16న పంజాబ్, హర్యానా, చండీగఢ్ ప్రాంతాల్లో ‘కోల్డ్ డే’ నుంచి ‘సివియర్ కోల్డ్ డే’ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. దీర్ఘకాలం చలికి గురైతే జలుబు, ఫ్లూ, ముక్కు నుంచి రక్తస్రావం వంటి సమస్యలు పెరిగే ప్రమాదం ఉందని సూచించింది.
దట్టమైన పొగమంచు – ప్రయాణాలకు ఆటంకం
రాబోయే ఐదు రోజుల పాటు వాయవ్య భారతదేశం, బీహార్‌లో ఘనమైన పొగమంచు ఏర్పడనుందని అంచనా. జనవరి 16న పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్‌లో విజిబిలిటీ 50 మీటర్ల కంటే తక్కువకు పడిపోవచ్చు. ప్రయాణికులు ఫాగ్ లైట్లు వినియోగించాలని, విమాన, రైలు సేవలపై అప్డేట్స్ తెలుసుకుంటూ ఉండాలని ఐఎండీ సూచించింది.
పర్వత ప్రాంతాల్లో మంచు వర్షాలు
తాజా వెస్ట్రన్ డిస్టర్బెన్స్ ప్రభావంతో జనవరి 16 నుంచి జమ్మూ కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మంచు వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ తెలిపింది.
దక్షిణ భారతానికి చలి ప్రభావం లేదు
దక్షిణ భారతదేశంలో మాత్రం వాతావరణం పొడిగా, స్పష్టంగా కొనసాగుతుంది. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి నగరాలపై ఉత్తరాది చలి ప్రభావం ఉండదని వాతావరణశాఖ తెలిపింది. ఈ ప్రాంతాల్లో ఈశాన్య మోన్సూన్ ముగిసే పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయని ఐఎండీ పేర్కొంది.