గాంధీ శాంతి పురస్కారాలు ప్రకటించిన కేంద్రం

India confers Gandhi Peace Prize 2020 on Sheikh Mujibur Rahman. జాతిపిత మహాత్మా గాంధీ పేరిట ఏటా ఇచ్చే శాంతి పురస్కారాలు

By Medi Samrat  Published on  23 March 2021 3:23 AM GMT
India confers Gandhi Peace Prize 2020 on Sheikh Mujibur Rahman

జాతిపిత మహాత్మా గాంధీ పేరిట ఏటా ఇచ్చే శాంతి పురస్కారాలు మన దేశంలోని అత్యున్నత పురస్కారాలలో ఒకటి. 2020, 2019 సంవత్సరాలకు కలిపి ఒకేసారి ఈ పురస్కారాలను భారత ప్రభుత్వం కేంద్ర సాంస్కృతిక శాఖ‌ ప్రకటించింది. 2020 ఏడాదికి గాను బంగ్లాదేశ్‌ తొలి అధ్యక్షుడు దివంగత షేక్‌ ముజిబుర్‌ రెహ్మాన్‌ను ఎంపిక చేయగా.. 2019కి ఒమన్‌ సుల్తాన్‌ దివంగత ఖబూస్‌ బిన్‌ సైద్‌ను ఎంపిక చేసింది.

బంగబంధుగా పిలిచే షేక్‌ ముజిబుర్‌ రెహ్మాన్‌ను మానవ హక్కులు, స్వేచ్ఛా విజేతగా ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. ఆయన భారతీయులకూ ఓ హీరో అన్నారు. ఆయన ఇచ్చిన వారసత్వం, ప్రేరణ భారత్, బాంగ్లాదేశ్ దేశాల సంబంధాలను మరింత బలోపేతం చేశాయని గుర్తుచేశారు.

అలాగే, 2019కి గాంధీ శాంతి పురస్కారానికి ఎంపికైన ఖబూస్.. అంతర్జాతీయ సమస్యలు తలెత్తినప్పుడు మధ్యవర్తిత్వం ద్వారా వాటిని పరిష్కరించడంలో చొరవ తీసుకొని, శాంతియుతమార్గంలో పరిష్కారానికి కృషిచేసి ప్రపంచ మన్ననలు పొందారు. భారత్‌- ఒమన్‌ మధ్య ప్రత్యేక సంబంధాల నిర్మాణంలో ఆయనదే కీలక పాత్ర. భారత్‌లో విద్యాభ్యాసం చేసిన ఖుబూస్‌.. మన దేశంతో ప్రత్యేక సంబంధాలు కొనసాగించారు. ఒమ‌న్ సుల్తాన్ ఖాబూస్ ఓ విజిన‌రీ నేత అని, భార‌త్‌, ఒమ‌న్ మ‌ధ్య బంధాన్ని బ‌లోపేతం చేయ‌డంలో ఆయ‌న కీల‌కంగా వ్య‌వ‌హ‌రించారని మోడీ గుర్తుచేశారు.

ముజిబుర్‌ రెహ్మాన్, ఖబూస్‌.. ఇద్దరూ గాంధీజీ చూపిన అహింసాయుత మార్గంలో సామాజిక, ఆర్థిక, రాజకీయ పరివర్తన కోసం చేసిన విశేష కృషికి గుర్తింపుగా ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. గొప్ప దూరదృష్టి కలిగిన నాయకులుగా కేంద్రం పేర్కొంది.మరణించిన వారికి ఈ పురస్కారం ప్రకటించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

1995 నుంచి గాంధీ శాంతి బ‌హుమ‌తిని భార‌త ప్ర‌భుత్వం అంద‌జేస్తున్న‌ది. గాంధీ 125వ జ‌యంతి ఉత్స‌వం సంద‌ర్భంగా ఆ అవార్డును స్థాపించారు. విజేత‌ల‌కు కోటి రూపాయ‌ల న‌గ‌దు,ఓ ప్ర‌శంసా ప‌త్రం, చేనేత వ‌స్తువుల‌ను అంద‌జేస్తారు.

ఈ అవార్డులను ప్రధాని మోదీ నేతృత్వంలోలోని జ్యూరీ ఏకగ్రీవంగా ఎంపిక చేసింది. ఈ జ్యూరీ లో సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తి, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేతతో పాటు లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, సులభ్‌ అంతర్జాతీయ సామాజిక సంస్థ వ్యవస్థాపకుడు బిందేశ్వర్‌ పాఠక్‌ సభ్యులుగా ఉన్నారు.అయితే మార్చి 26న బంగ్లాదేశ్‌లో జరిగే నేషనల్‌ డే కార్యక్రమానికి ప్రధాని మోదీ అతిథిగా హాజరుకానున్నారు. ఈ తరుణంలో ఆ దేశ నేత ముజిబుర్‌ రెహ్మాన్‌కు పురస్కారం ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది.


Next Story
Share it