ద్వైపాక్షిక సంబంధాలను మరింత మెరుగుపరుచుకునే లక్ష్యంతో, 2020 నుండి ఆగిపోయిన కైలాష్ మానస సరోవర్ యాత్రను తిరిగి ప్రారంభించాలని భారతదేశం - చైనా నిర్ణయించుకున్నాయి. ఇందుకోసం ఇరు దేశాల మధ్య నేరుగా విమాన సర్వీసులు నడపాలని అంగీకరించాయి. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ, చైనా విదేశాంగ ఉప మంత్రి సన్ వెయ్‌డాంగ్ భేటీ అయ్యారు. అంతర్జాతీయ నదులు, జల వనరులకు సంబంధించి డేటాను ఇచ్చిపుచ్చుకునేందుకు నిర్ణయించుకున్నాయి. కాగా కోవిడ్ - 19 కారణంగా మానస సరోవర్ యాత్రను 2020లో నిలిపివేశారు.
"ఈ నేపథ్యంలో, 2025 వేసవిలో కైలాష్ మానస సరోవర్ యాత్రను పునఃప్రారంభించాలని ఇరుపక్షాలు నిర్ణయించుకున్నాయి. ఇప్పటికే ఉన్న ఒప్పందాల ప్రకారం యాత్రను ప్రారంభించడానికి సంబంధించిన విధివిధానాలను సంబంధిత యంత్రాంగం చర్చిస్తుంది. భారత్-చైనా నిపుణులతో ముందస్తు సమావేశాన్ని నిర్వహించేందుకు కూడా వారు అంగీకరించారు. సరిహద్దు నదులకు సంబంధించిన హైడ్రోలాజికల్ డేటా, ఇతర సహకారాన్ని పునఃప్రారంభించడంపై చర్చించాం” అని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
విక్రమ్ మిస్రీ బీజింగ్‌లో రెండు రోజుల పర్యటన నిమిత్తం భారత్, చైనాల మధ్య విదేశాంగ కార్యదర్శి-వైస్ మినిస్టర్ మెకానిజం సమావేశం కోసం వచ్చారు. అక్టోబర్‌లో రష్యాలోని కజాన్‌లో ప్రధాని నరేంద్ర మోదీ, అధ్యక్షుడు జి జిన్‌పింగ్ మధ్య జరిగిన ఒప్పందాలకు అనుగుణంగా, ద్వైపాక్షిక సంబంధాలను స్థిరీకరించడానికి, మెరుగుపరచడానికి రెండు పక్షాలు ముఖ్యమైన చర్యలు తీసుకోవాలని అంగీకరించాయి.