భారత్ - చైనా సంబంధాల మధ్య కీలక పరిణామం
భారత్–చైనా ద్వైపాక్షిక సంబంధాలలో కొత్త పరిణామం చోటుచేసుకుంది. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ భారత పర్యటన అనంతరం
By అంజి
భారత్ - చైనా సంబంధాల మధ్య కీలక పరిణామం
భారత్–చైనా ద్వైపాక్షిక సంబంధాలలో కొత్త పరిణామం చోటుచేసుకుంది. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ భారత పర్యటన అనంతరం రెండు దేశాలు పలు కీలక ఒప్పందాలకు అంగీకరించాయి. భారత్ - చైనా బోర్డర్ ట్రేడ్ పునరుద్ధరణకు అంగీకరించాయి. చైనా ఫారిన్ మినిస్టర్ వాంగ్ భారత పర్యటన సందర్భంగా కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. లిపులేఖ్ పాస్, శిప్కీ లా పాస్, నాథు లా పాస్ ద్వారా బోర్డర్ ట్రేడ్ స్టార్ట్ చేసేందుకు అంగీకరించాయి. అటు డైరెక్ట్ ఫ్లైట్స్‌నూ పునరుద్ధరించనున్నాయి. టూరిస్ట్, బిజినెస్, మీడియా, విజిటర్ వీసాల జారీకి నిర్ణయించాయి.
డోక్లామ్ సంక్షోభం, అనంతరం కరోనా మహమ్మారి కారణంగా నిలిచిపోయిన భారత్–చైనా నేరుగా విమాన సర్వీసులు మళ్లీ ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు కొత్త ఎయిర్ సర్వీసెస్ ఒప్పందంను తుది దశకు తీసుకెళ్లాలని నిర్ణయించారు. అలాగే, పర్యాటకులు, వ్యాపారులు, మీడియా ప్రతినిధులు తదితరుల వీసా సౌకర్యాలను సులభతరం చేయనున్నారు. 2026 నుంచి భారత యాత్రికులకు కైలాస/గంగ్ రెన్‌పోచే – మానససరోవర్/మాపామ్ యున్ ట్సో యాత్ర మళ్లీ ప్రారంభం కానుంది. దీని కోసం రెండు దేశాలు పరస్పరం సహకరించేందుకు అంగీకరించాయి.
రెండు దేశాలు సరిహద్దు సమస్యలపై చర్చలకు కొత్త మెకానిజంలను ఏర్పాటు చేయనున్నాయి. ప్రస్తుత దౌత్య, సైనిక మార్గాలను కొనసాగిస్తూ, సరిహద్దు ఉద్రిక్తతలను తగ్గించేందుకు కృషి చేయాలని అంగీకరించారు. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన నివాసంలో భేటీ అయ్యారు. “స్థిరమైన, అంచనా వేయగల, నిర్మాణాత్మక సంబంధాలు భారత్–చైనా మధ్య ఏర్పడితే, అది ప్రాంతీయ, ప్రపంచ శాంతి – సమృద్ధికి దోహదం చేస్తుంది” అని మోదీ ఎక్స్ (X) లో పోస్టు చేశారు.
ఈ పర్యటనలో వాంగ్ యీ, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ లతో కూడా చర్చలు జరిపారు. చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకారం, “పరస్పర నమ్మకాన్ని పెంచేందుకు సంభాషణ కొనసాగాలి. సహకారాన్ని విస్తరించాలి” అని వాంగ్ యీ దోవల్‌తో అన్నారు. అజిత్ దోవల్ ప్రకటన ప్రకారం, ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 31 – సెప్టెంబర్ 1 తేదీల్లో చైనా టియాంజిన్‌లో జరగబోయే SCO సదస్సుకు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక ప్రతినిధుల స్థాయి చర్చలకు “అత్యంత ప్రాధాన్యత” ఉందని ఆయన పేర్కొన్నారు. వాంగ్ యీ భారత పర్యటన, ప్రస్తుతం వాషింగ్టన్ – న్యూఢిల్లీ సంబంధాలలో ఏర్పడిన ఉద్రిక్తతల మధ్య ప్రాధాన్యత సంతరించుకుంది.