కాశ్మీర్ సమస్య కోసం రహస్యంగా చర్చలు జరుగుతున్నాయా..?

India and Pakistan held secret talks.భారత్, పాకిస్థాన్‌కు చెందిన ఇంటెలిజెన్స్ అధికారులు కాశ్మీర్ కోసం దుబాయ్‌లో ర‌హ‌స్యంగా చ‌ర్చ‌లు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  15 April 2021 1:10 PM GMT
India Vs Pakistan about Kashmir

భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య కాశ్మీర్ వ్యవహారం ఎన్నో ఏళ్లుగా సమస్యగా ఉంది. కాశ్మీర్ భారతదేశానికి చెందిందే అయినప్పటికీ.. పాకిస్థాన్ మాత్రం ఇప్పటికీ తమదేనని చెబుతూ ఉంది. అమాయకులైన యువతను రెచ్చగొడుతూ తీవ్రవాదం వైపు మళ్లేలా చేస్తోంది. ఇక కాశ్మీర్ సమస్యను వీలైనంత త్వరగా సమిసిపోయేలా చేయాలని ప్రస్తుతానికి ఇరు దేశాలు కూడా భావిస్తూ ఉన్నాయి. ఆ విధంగా చర్యలను కూడా తీసుకుంటూ ఉన్నారని తెలుస్తోంది. భారత్, పాకిస్థాన్‌కు చెందిన ఇంటెలిజెన్స్ అధికారులు గ‌త జ‌న‌వ‌రిలో దుబాయ్‌లో ర‌హ‌స్యంగా చ‌ర్చ‌లు జ‌రిపిన‌ట్లు ప్ర‌ముఖ న్యూస్ ఏజెన్సీ రాయ్‌ట‌ర్స్ వెల్ల‌డించింది.

క‌శ్మీర్ విష‌యంలో రెండు దేశాల మ‌ధ్య నెల‌కొన్న ఉద్రిక్త ప‌రిస్థితుల‌ను చ‌ల్లార్చ‌డానికి వీళ్లు చ‌ర్చ‌లు జరిపిన‌ట్లు తెలిపింది. ఇండియాకు చెందిన రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (రా) స‌భ్యులు, పాకిస్థాన్‌కు చెందిన ఇంట‌ర్ స‌ర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) ఏజెంట్లు యూఏఈ ప్ర‌భుత్వం మ‌ధ్య‌వ‌ర్తిత్వం వ‌హించిన చ‌ర్చ‌ల్లో పాల్గొన్న‌ట్లు రాయ్‌ట‌ర్స్ తెలిపింది. అయితే ఈ వార్త‌ల‌పై ఇటు భార‌త విదేశాంగ శాఖగానీ, అటు పాకిస్థాన్ ఐఎస్ఐగానీ స్పందించ‌లేదు. పాకిస్థాన్‌కు చెందిన ర‌క్ష‌ణ శాఖ నిపుణురాలు అయేషా సిద్ధిఖీ మాత్రం ఈ చ‌ర్చ‌లు నిజ‌మేన‌ని అన్నారు. రెండు దేశాల ఇంటెలిజెన్స్ అధికారులు కొన్ని నెల‌లుగా స‌మావేశ‌మ‌వుతూనే ఉన్నార‌ని.. దుబాయ్‌లోనే కాదు థాయ్‌లాండ్‌, లండ‌న్‌ల‌లోనూ ఈ స‌మావేశాలు జ‌రిగిన‌ట్లు చెప్పారు. అంతేకాదు వీటి వ‌ల్ల పెద్ద‌గా ఒరిగేదేమీ లేద‌ని అయేషా పెదవి విరిచింది.


Next Story