ఫ్రాన్స్‌తో భారత్‌ రూ.63 వేల కోట్ల డీల్..26 రాఫెల్-ఎం జెట్‌ల కోసం

భారతదేశం, ఫ్రాన్స్ దేశంతో మరో కీలక రక్షణ ఒప్పందాన్ని విజయవంతంగా ముగించింది.

By Knakam Karthik
Published on : 28 April 2025 6:15 PM IST

National News, India, France, Rafale Marine, fighter jets, defense deal, Indian Navy

ఫ్రాన్స్‌తో భారత్‌ రూ.63 వేల కోట్ల డీల్..26 రాఫెల్-ఎం జెట్‌ల కోసం

భారతదేశం, ఫ్రాన్స్ దేశంతో మరో కీలక రక్షణ ఒప్పందాన్ని విజయవంతంగా ముగించింది. నౌకా దళం కోసం ప్రత్యేకంగా రూపొందించిన 26 రాఫెల్-ఎమ్ (Rafale-M) యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంపై నేడు నౌసేన భవన్‌లో అధికారికంగా సంతకం చేశారు. ఈ ఒప్పంద విలువ సుమారు రూ.63,000 కోట్లు. ఇది భారత సముద్రపు రక్షణ సామర్థ్యాన్ని భారీగా పెంచేలా రూపుదిద్దుకుంటోంది.

ప్రభుత్వం-ప్రభుత్వం మధ్య (G2G) కుదిరిన ఈ ఒప్పందం ప్రకారం, భారత నౌకాదళానికి 22 సింగిల్ సీట్ రఫేల్-ఎం జెట్స్, నాలుగు ట్విన్ సీట్ శిక్షణ విమానాలు అందనున్నాయి. ఈ యుద్ధ విమానాలు ప్రధానంగా స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ పై నుంచి తమ కార్యకలాపాలను నిర్వహిస్తాయి. కొద్ది రోజుల క్రితమే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ (CCS) ఈ ఒప్పందానికి ఆమోదం తెలిపింది.

ఒప్పందంలో భాగంగా విమానాలతో పాటు కొన్ని రకాల ఆయుధాలు, సిమ్యులేటర్లు, సిబ్బందికి శిక్షణ, ఐదేళ్ల పాటు పనితీరు ఆధారిత లాజిస్టిక్స్ సహకారం కూడా ఫ్రాన్స్ అందించనుంది. ఒప్పందం విలువలో ప్రాథమికంగా 15 శాతం మొత్తాన్ని భారత్ చెల్లించనుంది. మొత్తం 26 విమానాల డెలివరీ ప్రక్రియ 37 నెలల నుంచి 65 నెలల మధ్య పూర్తవుతుందని, 2031 నాటికి అన్ని జెట్స్ నౌకాదళానికి అందుబాటులోకి వస్తాయని అధికారులు తెలిపారు.

రాఫెల్-ఎమ్ అంటే ఏమిటి?

రాఫెల్-ఎమ్ (Marine Version) అనేది ఫ్రాన్స్‌కు చెందిన డస్సాల్ట్ ఏవియేషన్ సంస్థ రూపొందించిన నౌకాదళ యుద్ధ విమానం. ఇది ప్రత్యేకంగా ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్‌లపై నుండి టేక్-ఆఫ్, ల్యాండింగ్ కోసం రూపొందించబడింది. INS విక్రాంత్ వంటి భారతీయ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్‌లకు ఇది ముఖ్యమైన అస్త్రం కానుంది.

ఒప్పందానికి ప్రాధాన్యత భారత నౌకాదళం ఆధునికీకరణ

ప్రస్తుతం భారత నౌకాదళం మిగతా దేశాలతో పోలిస్తే అధునాతన యుద్ధ విమానాల కొరతను ఎదుర్కొంటోంది. రాఫెల్-ఎమ్ ద్వారా ఈ లోటు తీరనుంది. హిందూ మహాసముద్ర ప్రాంతంలో చైనా నౌకాదళం దూకుడుగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో, సముద్రంపై ఆధిపత్యం నిలబెట్టుకోవడం భారత ప్రయోజనాలకు అవసరమైంది. ఫ్రాన్స్‌తో రక్షణ రంగంలో దీర్ఘకాలిక భాగస్వామ్యాన్ని మరో అడుగు ముందుకు తీసుకెళ్లే ప్రాధాన్యత ఈ ఒప్పందానికి ఉంది.

సముద్ర లక్ష్యాలపై దాడులు, వాయు రక్షణ, నిఘా వంటి బహుళ ప్రయోజనకరమైన ఈ 4.5వ తరం రఫేల్ యుద్ధ విమానాలు అణ్వాయుధాలను ప్రయోగించగల సామర్థ్యాన్ని కూడా కలిగి ఉన్నాయి. ఈ జెట్స్‌లో 70 కిలోమీటర్ల పరిధి గల ఎక్సోసెట్ ఏఎం39 యాంటీ-షిప్ మిస్సైళ్లు, 300 కిలోమీటర్లకు పైగా దూరంలోని లక్ష్యాలను ఛేదించగల స్కాల్ప్ గగనతలం నుంచి భూమి పైకి ప్రయోగించే క్రూయిజ్ క్షిపణులు, 120-150 కిలోమీటర్ల పరిధిలో శత్రు విమానాలను ఎదుర్కోగల అత్యాధునిక మెటియోర్ ఎయిర్ టు ఎయిర్ క్షిపణులను కూడా అమర్చనున్నారు.

Next Story