ఏడు సార్లు దాద్రా నాగర్ హవేలీ ఎంపీగా గెలుపొందిన మోహన్ దేల్కర్ ముంబైలోని హోటల్ లో మరణించినట్లు అధికారులు ధృవీకరించారు. ముంబై లోని మెరైన్ డ్రైవ్ లో ఉన్న హోటల్ లో ఆయన మరణించినట్లుగా పోలీసులు సోమవారం నాడు ధృవీకరించారు. అయన ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు భావిస్తూ ఉన్నారు. పోస్ట్ మార్టం నిమిత్తం మోహన్ దేల్కర్ మృతదేహాన్ని తరలించారు.
మెరైన్ డ్రైవ్ లో ఉన్న సీ గ్రీన్ హోటల్ కు పోలీసులు హుటాహుటిన తరలివెళ్లారు. అక్కడే మోహన్ చనిపోయినట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతానికి ఈ కేసుపై ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. 58 సంవత్సరాల మోహన్ దేల్కర్ ఇండిపెండెంట్ గా నిలబడి పార్లమెంట్ మెంబర్ గా గెలిచారు. 2019 లోక్ సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టారు. బీహార్ చీఫ్ మినిస్టర్ నితీష్ కుమార్ తో ఎన్నికల సమయంలో చర్చలు జరిపి జేడీయూ చెంతన చేరారు.
ముంబైలో పని ఉండడంతో మోహన్ దేల్కర్ వచ్చారని ఆయన సన్నిహితులు తెలిపారు. ఆయన మరణించారని తెలియగానే పలువురు సంతాపం ప్రకటించారు. మరణానికి సంబంధించిన కారణాలు తెలియరావాల్సి ఉంది. మోహన్ దేల్కర్ కు ఇద్దరు పిల్లలు ఉన్నారు. 2004 నుండి మోహన్ దాద్రా నాగర్ హవేలీకి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు.