ప్రధాని మోదీ పంద్రాగస్టు ప్రసంగంపై కాంగ్రెస్ విమర్శలు
ప్రధాని మోదీ చేసిన పలు వ్యాఖ్యలను కాంగ్రెస్ తీవ్రంగా తప్పుబడుతోంది.
By Srikanth Gundamalla Published on 15 Aug 2023 7:38 AM GMTప్రధాని మోదీ పంద్రాగస్టు ప్రసంగంపై కాంగ్రెస్ విమర్శలు
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ జెండా ఎగురవేశారు. ఆ తర్వాత జాతినుద్దేశించి ప్రసంగం చేశారు. అయితే.. ప్రధాని మోదీ చేసిన పలు వ్యాఖ్యలను కాంగ్రెస్ తీవ్రంగా తప్పుబడుతోంది. ముఖ్యంగా వచ్చే ఏడాది మళ్లీ ఆగస్టు 15న వస్తానని.. మళ్లీ ఇక్కడే జెండా ఎగురవేస్తానని ప్రధాని మాట్లాడటంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఆగ్రహం వ్యక్తం చేశారు.
అవును మోదీ వచ్చే ఏడాది కూడా జెండా ఎగరవేస్తారు.. కానీ అది ఆయన ఇంటిపైనే అంటూ ఖర్గే ఎద్దేవా చేశారు. గెలిచిన వాళ్లు ఎప్పుడూ మేమే మళ్లీ అధికారంలోకి వస్తామని చెబుతుంటారని అన్నారు. కానీ..గెలుపోటములు రాజకీయ నాయకుల చేతుల్లో ఉండవు అని.. ప్రజల చేతుల్లో ఉంటుందని చెప్పారు. 2024లో మళ్లీ జాతీయ పతాకాన్ని ఎగరేస్తానంటూ ప్రధాని నరేంద్రమోదీ 2023లోనే చెప్పడం వారి గర్వాన్ని సూచిస్తోందని అన్నారు ఖర్గే. ప్రధాని మోదీకి పంద్రాగస్టు వేడుకల సందర్భంగా కూడా ప్రతిపక్షాలపై విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారంటూ ఖర్గే వ్యాఖ్యానించారు. ఎప్పుడు ప్రతిపక్షాలపై పడి మాట్లాడుతుంటే..దేశాన్ని నిర్మించేదెప్పుడు అని ప్రశ్నించారు. ఎంతో మంది నాయకులు దేశాన్ని పాలించారని... కానీ వీరొక్కరే దేశాన్ని అభివృద్ధి చేసినట్లుగా మాట్లాడటం సరికాదని మల్లికార్జున ఖర్గే అన్నారు.
కాగా.. ఎర్రకోట వద్ద పంద్రాగస్టు వేడుకులకు హాజరుకాకపోవడంపైనా మల్లికార్జున ఖర్గే వివరణ ఇచ్చారు. తనకు కంటి సంబంధిత సమస్యలు ఉన్నాయని అన్నారు. ముందుగా ప్రొటోకాల్ ప్రకారమే ఉదయం 9.20 గంటలకు ఇంటి వద్ద పతాకాన్ని ఎగురవేశానని.. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించానని ఖర్గే చెప్పారు. అందుకే సమయానికి ఎర్రకోట వద్దకు చేరుకోలేకపోయానని వివరించారు మల్లికార్జున ఖర్గే. దీనికి తోడు భద్రతా దళాలు ప్రధానిని తప్ప ఎవరినీ ముందుకు వెళ్లనీయడం లేదని అసహనం వ్యక్తం చేశారు. భద్రతా కారణాలు, సమయాభావం కారణంగా ఎర్రకోటకు వెళ్లకపోవడమే మంచిదని భావించానని మల్లికార్జున ఖర్గే తెలిపారు. ఎర్రకోటలో పంద్రాగస్టు వేడుకల సందర్భంగా ఖర్గే కోసం కేటాయించిన సీటు ఖాళీగా కనిపించింది. దాంతో.. ఖర్గేతో పాటు కాంగ్రెస్ వివరణ ఇచ్చింది. అనారోగ్య కారణాలతోనే హాజరుకాలేకపోయారంటూ తెలిపారు.