భరతమాత స్వేచ్ఛావాయువులు పీల్చి 77 ఏళ్లు పూర్తి చేసుకుని 78వ వసంతంలోకి అడుగుపెట్టింది. సమరయోధులు తమ ప్రాణాలను పణంగా పెట్టి దేశానికి స్వాతంత్ర్యం సంపాదించారు. నాటి నుంచి భారత్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ ప్రపంచ దేశాలతో పోటీ పడుతోంది. ఇవాళ ప్రధాని మోదీ ఎర్రకోటపై జాతీయ జెండా ఎగురవేయనున్నారు. ప్రధాని మోదీ జాతీయ జెండాను ఆవిష్కరించి, అనంతరం జాతిని ఉద్దేశించి ప్రసంగించడంతో వేడుక ప్రారంభమవుతుంది.
ఈ సంవత్సరం థీమ్, 'విక్షిత్ భారత్@2047', 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశంను నిర్మించాలన్నదే తమ నినాదమని ప్రభుత్వం చెబుతోంది. ఈ వేడుకలో గార్డ్ ఆఫ్ ఆనర్, 21-గన్ సెల్యూట్, IAF హెలికాప్టర్ల ద్వారా పూల రేకుల వర్షం కూడా ఉంటుంది. దేశ రాజధాని , భారతదేశంలోని నగరాల్లో భద్రతను పెంచారు. ఈరోజు స్వాతంత్ర్య దినోత్సవం నేపథ్యంలో వాహనాలు, ప్రయాణికులను తనిఖీ చేస్తున్నారు.
అలాగే ఏపీలో సీఎం చంద్రబాబు, తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి జెండా ఎగురవేస్తారు. 78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా పలు ప్రభుత్వ కార్యాలయ భవనాలు భారత జాతీయ జెండాలోని మూడు రంగులతో దేదీప్యమానంగా వెలిగిపోయాయి. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ముంబైలోని మంత్రాలయ భవనంలో దీపాలు వెలిగించారు.