దేశ రాజధాని ఢిల్లీలో డ్రైవర్‌లెస్ మెట్రో సర్వీసును ప్రారంభించారు. ఇవాళ పింక్ లైన్ కారిడార్‌లో డ్రైవర్ లెస్ మెట్రో సర్వీసు పరుగులు పెట్టింది. డ్రైవర్ లెస్ మెట్రో రైలును కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రి హర్దీప్‌సింగ్ పూరి, ఢిల్లీ రవాణాశాఖ మంత్రి కైలాష్ గెహ్లాట్‌లు ప్రారంభించారు. మొత్తం 59 కిలోమీటర్ల పొడవైన్ పింక్ లైన్ కారిడార్‌లో డ్రైవర్ లెస్ మెట్రో రైలు ఆపరేషన్‌ను ప్రారంభించారు. "ఢిల్లీ మెట్రో పింక్ లైన్ (మజ్లిస్ పార్క్ నుండి శివ విహార్ వరకు) డ్రైవర్‌లెస్ రైలు కార్యకలాపాలు 25 నవంబర్ 2021 ఉదయం 11:30 గంటలకు ప్రారంభించబడింది.
ఢిల్లీ మెట్రో పూర్తి ఆటోమేటిక్ నెట్‌వర్క్ విస్తీర్ణం 97 కిలోమీటర్లకు పెరగగా.. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద డ్రైవర్ లెస్ మెట్రోగా నిలిచింది. ఇక భారత్‌లో ఏకైక డ్రైవర్ లెస్ మెట్రో ఆపరేషన్ నెట్‌వర్క్ ఇది. గత సంవత్సరం, ప్రధాని నరేంద్ర మోడీ దేశంలో మొట్టమొదటి డ్రైవర్‌లెస్ రైలును మెజెంటా లైన్‌లో ప్రారంభించారు ఎయిర్‌పోర్ట్ ఎక్స్‌ప్రెస్ లైన్‌లో నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్‌ను ప్రారంభించారు. 2025 నాటికి 25 నగరాలకు మెట్రో సేవలను విస్తరింపజేస్తామని కూడా ప్రధాని చెప్పారు. పింక్ లైన్‌లో డ్రైవర్‌లెస్ రైళ్లు 2021 మధ్య నాటికి ప్రారంభమవుతాయని గత ఏడాది DMRC అధికారులు తెలిపారు. అయితే, కొనసాగుతున్న కరోనావైరస్ వ్యాధి (కోవిడ్ -19) మహమ్మారి కారణంగా మెట్రో సేవలు ప్రభావితం కావడంతో ఆలస్యం అయింది. పింక్ లైన్ 2019 సంవత్సరంలో ప్రారంభించబడింది. ప్రస్తుతం ఢిల్లీ మెట్రో నోయిడా-గ్రేటర్ నోయిడా మెట్రో కారిడార్, రాపిడ్ మెట్రో, గురుగ్రామ్‌తో సహా 286 స్టేషన్‌లతో దాదాపు 392 కి.మీ వరకు విస్తరించింది.