బిడ్డకు ఏదైన కష్టం వస్తే తల్లడిల్లిపోతుంది అమ్మ హృదయం. ఎలాగైనా సరే ఆ కష్టం నుంచి బిడ్డ బయటపడాలని కోరుకుంటుంది. తన ప్రాణాలను సైతం ఇచ్చి బిడ్డను కాపాడుకుంటుంది. ఇక బిడ్డకు జన్మనివ్వడం అమ్మకు పునర్జమ్మ లాంటిది అని అంటారు. బిడ్డకు జన్మనిచ్చిన అనంతరం తన బిడ్డను తొలిసారి చూసుకుని అప్పటి వరకు పడిన కష్టాన్ని మరిచిపోతుంది. అలాంటిది.. కొందరు అమ్మతనానికే మాయని మచ్చ తెచ్చేలా ప్రవర్తిస్తున్నారు. పుట్టిన బిడ్డను సజీవంగా ఉండగానే భూమిలో పాతిపెట్టింది. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. లఖ్‌నవూ పట్టణంలోని ఓ బస్తీలోని జిల్లా ఆస్పత్రికి సమీపంలో ఓ మహిళకు చిన్నారి ఏడుపు వినిపించింది. ఏడుపు వినిపించే ప్రాంతానికి వెళ్లిన మహిళ ఒక్కసారిగా షాక్ తిన్నది. ఖాళీస్థలంలో భూమిలో సగం పాతిపెట్టిన శిశువు కనిపించింది. వెంటనే ఆమె పోలీసులకు సమాచారం అందించింది. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు ఆ శిశువును భూమిలోంచి బయటకు తీసి జిల్లా ఆస్పత్రిలోని పిల్లల వార్డుకు తరలించారు. అక్కడి వైద్యులు పాపకు చికిత్స అందించారు. ప్రస్తుతం ఆ చిన్నారి ఆరోగ్యంగానే ఉందని చెప్పారు. ఆ బిడ్డను శిశు సంరక్షణ అధికారులకు అప్పగించారు. కాగా.. బిడ్డను సజీవంగా భూమిలో పాతిపెట్టి వెళ్లిపోయిన తల్లి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.