కోల్ కతా వైద్య విద్యార్థిని అత్యాచారం కేసులో లై డిటెక్షన్ టెస్ట్ ను నిర్వహించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఆగస్టు 9వ తేదీ ఉదయం మెడికల్ కాలేజీ, ఆసుపత్రిలోని సెమినార్ హాల్‌లో జూనియర్ డాక్టర్ మృతదేహం లభ్యం కాగా.. ఒకరి కంటే ఎక్కువ మంది నిందితులు అత్యాచారం చేసినట్లు అనుమానిస్తున్నారు. సుప్రీంకోర్టు ఈ కేసును స్వయంగా విచారణకు స్వీకరించింది. భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు జేబీ పార్దివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం రేపు ఈ కేసును విచారించనుంది.
ఆసుపత్రిలో పనిచేసిన సంజయ్ రాయ్ ఘటనా స్థలం నుండి బయటకు రావడం సీసీటీవీ విజువల్స్ లో కనిపించింది. ఈ కేసులో కీలక నిందితుడుగా సంజయ్ ఉన్నాడు. లై డిటెక్టర్ పరీక్షకు అనుమతినిచ్చిన హైకోర్టు ఈ కేసు విచారణను ఆగస్టు 29కి వాయిదా వేసింది. ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌ను కూడా సీబీఐ శుక్ర, శనివారాల్లో చాలా గంటలపాటు ప్రశ్నించింది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై తమకు నమ్మకం పోయిందని జూనియర్ డాక్టర్ తల్లిదండ్రులు చెప్పారు. ఇంతకు ముందు నాకు ఆమె (మమతా బెనర్జీ)పై పూర్తి విశ్వాసం ఉండేది.. కానీ ఇప్పుడు లేదని బాధితురాలి తల్లిదండ్రులు తెలిపారు.