కశ్మీర్‌పై కాశ్మీర్ ఫైల్స్ సినిమా తీయగలిగినప్పుడు.. లఖింపూర్ ఫైల్స్ కూడా తీయవచ్చని యూపీ మాజీ సీఎం, సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ బుధవారం అన్నారు. రాష్ట్రంలో ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమి తర్వాత తొలిసారిగా యూపీలోని సీతాపూర్‌లో అఖిలేష్ యాదవ్ విలేకరులతో మాట్లాడారు. యూపీ ఎన్నికల్లో 403 అసెంబ్లీ స్థానాలకు గానూ 255 స్థానాల్లో బీజేపీ గెలవగా.. అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్ వాదీ పార్టీ 111 సీట్లతో సరిపెట్టుకుంది.
కశ్మీర్‌పై కాశ్మీర్ ఫైల్స్ తీయగలిగినప్పడు.. లఖింపూర్‌లో నిరసన చేస్తున్న రైతులను జీపులో తొక్కించిన సంఘటనపై లఖింపూర్ ఫైల్స్ ఎందుకు తీయలేరని అఖిలేష్ యాదవ్ అన్నారు. గత ఏడాది అక్టోబర్ 3న లఖింపూర్‌లో కేంద్ర మంత్రి కుమారుడి జీపు కేంద్రం ప్రవేశపెట్టిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులపైకి దూసుకెళ్లడంతో హింస చెలరేగింది. ఈ ఘటనలో నలుగురు రైతులు, ఒక జర్నలిస్టు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు.
రాష్ట్రంలో ఇటీవల ముగిసిన ఎన్నికలపై కూడా అఖిలేష్ స్పందించారు. ఓటర్ల మద్దతుతో పార్టీ ఓట్ల శాతం, సీట్ల సంఖ్య పెరిగిందని అన్నారు. "మేము నైతికంగా విజయం సాధించాము. భవిష్యత్తులో బీజేపీకి సీట్లు తగ్గుతాయి. ఇప్పటికీ కొన్ని ప్రాథమిక అంశాలు బీజేపీకి అడ్డంకిగా ఉన్నాయని అన్నారు.