కీలకమైన విషయాలపై రాష్ట్ర మంత్రికి వివరించడానికి జరిగిన సమావేశాలకు గైర్హాజరు అవ్వడంతో మహారాష్ట్ర ప్రభుత్వం ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS) అధికారిని, రాష్ట్ర కాలుష్య నియంత్రణ సంస్థ జాయింట్ డైరెక్టర్‌ను సస్పెండ్ చేసింది. రాష్ట్ర పర్యావరణ శాఖ మంత్రి పంకజా ముండే ఏర్పాటు చేసిన కీలక సమావేశానికి హాజరుకానందుకు ఏకంగా ఒక సీనియర్ ఐఏఎస్ (IAS) అధికారితో పాటు మరో ఉన్నతాధికారిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది.
ఫిబ్రవరి 26న మహారాష్ట్ర అసెంబ్లీలో చంద్రపూర్ జిల్లాలో కాలుష్య సమస్యపై చర్చ జరిగింది. దీనిపై మంత్రి పంకజా ముండే సమాధానం చెబుతూ అధికారులతో తాను రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేస్తే వారు రాలేదని, అందుకే తాను సభకు పూర్తి వివరాలు ఇవ్వలేకపోతున్నానని తెలిపారు. 2011 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి, మహారాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (MPCB) మెంబర్ సెక్రటరీ ఎం. దేవేందర్ సింగ్, జాయింట్ డైరెక్టర్ సతీష్ పడ్వాల్ మీటింగ్‌కు రాలేదని, పైగా తాను మీటింగ్‌కు రాలేనని సదరు ఐఏఎస్ అధికారి తనకు మెసేజ్ కూడా చేశారని మంత్రి సభ దృష్టికి తీసుకెళ్లారు. అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రొటెం స్పీకర్ దిలీప్ లాండే.. ఇది అధికారుల తీవ్ర నిర్లక్ష్యమని, శాసనసభను, ప్రజలను అవమానించడమేనని, వెంటనే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు.
దీంతో 24 గంటల్లోపే ఆ ఐఏఎస్ అధికారితో పాటు, జాయింట్ డైరెక్టర్‌ను ఆలిండియా సర్వీసెస్ నిబంధనల కింద మహారాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.