ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయులను తిరిగి తీసుకురావడానికి భారత వైమానిక దళం(IAF) తమ ప్రయత్నాలను మొదలుపెట్టింది. అయితే భారత ఎయిర్ ఫోర్స్ పాకిస్థాన్ గగనతలాన్ని తప్పించింది. పాక్ ఎయిర్ స్పేస్ ను భారత్ వాడడం లేదు. IAF కు చెందిన నాలుగు C-17 గ్లోబ్‌మాస్టర్ రవాణా విమానాలు 800 మంది భారతీయులను తిరిగి తీసుకువస్తున్నాయి. పాక్ గగనతలానికి దూరంగా ఉండాలని నిర్ణయించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. పాకిస్తానీ గగనతలాన్ని తప్పించడం వలన గరిష్టంగా 25-30 నిమిషాల అదనపు సమయం పడుతుందని ఒక అధికారి తెలిపారు.
ఆపరేషన్ గంగా కార్యక్రమం కింద ఇప్పటికే చాలా మంది విద్యార్థులను భారత్ కు తీసుకుని వస్తున్నారు. 19 విమాన సర్వీసులతో 3,726 మంది విద్యార్థులను తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ విమాన సర్వీసులను ఉక్రెయిన్ సరిహద్దు దేశాల నుంచి నడిపిస్తున్నారు. ఉక్రెయిన్ గగనతలాన్ని మూసివేయడంతో విద్యార్థులను రోడ్డు మార్గంలో సరిహద్దులు దాటించి, అక్కడికి సమీపంలోని విమానాశ్రయాలకు తరలించారు. 8 విమానాలు బుకారెస్ట్ నుంచి, రెండు విమాన సర్వీసులు సుసేవ నుంచి, కోసీ నుంచి ఒకటి, బుడాపెస్ట్ నుంచి ఐదు, రెస్జోవ్ నుంచి 3 విమాన సర్వీసులు బయల్దేరతాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. ప్రధాని మోదీజీ ఆదేశాలతో ఒక్కరోజే 3,726 మందిని తరలిస్తున్నట్టు చెప్పారు.