కుప్ప‌కూలిన మిగ్-29 విమానం.. వారు సేఫ్‌..!

వాయుసేనకు చెందిన మిగ్-29 విమానం సోమవారం ఆగ్రా స‌మీపంలో కూలిపోయింది.

By Medi Samrat  Published on  4 Nov 2024 3:45 PM GMT
కుప్ప‌కూలిన మిగ్-29 విమానం.. వారు సేఫ్‌..!

వాయుసేనకు చెందిన మిగ్-29 విమానం సోమవారం ఆగ్రా స‌మీపంలో కూలిపోయింది. పైలట్, కో పైలట్ దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. ఎయిర్ ఫోర్స్ విడుదల చేసిన ఒక ప్రకటనలో.. సాధారణ శిక్షణా విమానంలో సాంకేతిక లోపం కారణంగా ఈ ప్రమాదం జరిగిందని పేర్కొంది. ఈ మొత్తం ప్రమాదంపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టనున్నారు. కాగరౌల్‌లోని సోనిగా గ్రామ సమీపంలోని ఖాళీ పొలాల్లో పైలట్ తెలివిగా వ్య‌వ‌హ‌రించి విమానాన్ని దింపడం విశేషం. విమానం జనావాస ప్రాంతంలో కూలిపోయి ఉంటే భారీ నష్టం జరిగి ఉండేది.

ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఇది మిగ్-29 విమానం. ఇది పంజాబ్‌లోని అడంపూర్ నుండి బయలుదేరింది. ప్ర‌మాదం త‌ర్వాత ఘటనా స్థలానికి గ్రామస్తులు భారీగా చేరుకున్నారు. పోలీసు బలగాలు కూడా వెంట‌నే సంఘటనా స్థలానికి చేరుకున్నాయి.

కాగ్రోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాఘా, బహా గ్రామం మధ్య ఉన్న రైతు బాబీ పొలంలో ఈ విమానం కూలిపోయింది. స్థానిక నివాసి అజయ్ చాహర్ మాట్లాడుతూ.. ఈరోజు విమానం తన గ్రామం నారోల్ మీదుగా వెళ్ళిందని.. పైలట్ స‌మ‌య‌స్పూర్తి కారణంగా విమానం గ్రామంలో పడలేదని.. లేకుంటే అది భారీ నష్టం కలిగించేద‌ని చెప్పారు.

ప్ర‌మాదం త‌ర్వాత ఎయిర్ ఫోర్స్ బృందం ఘటనా స్థలానికి చేరుకుంది. పదుల సంఖ్యలో అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

సాధారణ శిక్షణా విమానంలో సిస్టమ్ లోపం కారణంగా మిగ్-29 విమానం ఈరోజు ఆగ్రా సమీపంలో కూలిపోయిందని భారత వైమానిక దళం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకోవడానికి వైమానిక దళం విచారణకు ఆదేశించింది.

Next Story