ఆ కూటమిని కేర్ చేయను: అసదుద్దీన్ ఒవైసీ
ఇండియా కూటమిలోకి ఎంఐఎంను ఆహ్వానించకపోవడంపై ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు.
By Medi Samrat Published on 17 Sept 2023 8:15 PM ISTఇండియా కూటమిలోకి ఎంఐఎంను ఆహ్వానించకపోవడంపై ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. ఇండియా కూటమిని తాను అసలు కేర్ చేయనని చెప్పారు. వాస్తవానికి దేశంలో రాజకీయ శూన్యత ఉందని, ఆ శూన్యతను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని థర్డ్ ఫ్రంట్ భర్తీ చేస్తుందని భావించానని చెప్పారు. ఈ రాజకీయ శూన్యతను ఇండియా కూటమి భర్తీ చేయలేదని తెలిపారు. ఇండియా కూటమిలో కేసీఆర్, బీఎస్పీ అధినేత్రి మాయావతి, మహారాష్ట్ర, ఈశాన్య రాష్ట్రాలలోని ఎన్నో పార్టీలు భాగస్వాములు కాదని చెప్పారు.
థర్డ్ ఫ్రంట్ కచ్చితంగా ఏర్పడుతుందని తాను అనుకుంటున్నట్టు అసదుద్దీన్ చెప్పారు. మాయావతి, కేసీఆర్ వంటి నేతలు ఎన్డీయే, ఇండియా అలయెన్స్‌లో లేరని, ఆ పార్టీలకు గణనీయమైన ఉనికి ఉందని అన్నారు. కేసీఆర్ సారథ్యం చేపట్టి, థర్డ్ ఫ్రంట్ వైవిద్యం చాటుకుంటారని తాను అనుకుంటున్నానని చెప్పారు. దళితులు, ఇతర వెనుకబడిన తరగతులకు (ఓబీసీ) రిజర్వేషన్లు పెంచాలని సీడబ్ల్యూసీ సిఫారసు చేసిందని, ముస్లింల సంగతేమిటని ప్రశ్నించారు. మహారాష్ట్రలో ముస్లింల రిజర్వేషన్ గురించి వాళ్లు ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు. తాను పదే పదే పార్లమెంటులో ఈ విషయంపై నిలదీస్తూనే ఉన్నానని చెప్పారు.