హ్యూమన్ జీపీఎస్ బాగూఖాన్‌ హతం

జమ్ముకశ్మీర్‌లోని నౌషెరా సెక్టార్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో హిజ్బుల్ ముజాహిద్దీన్ సంస్థకు చెందిన మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్, 'హ్యూమన్ జీపీఎస్'గా పేరుగాంచిన బాగూఖాన్‌ను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి

By Medi Samrat
Published on : 30 Aug 2025 7:23 PM IST

హ్యూమన్ జీపీఎస్ బాగూఖాన్‌ హతం

జమ్ముకశ్మీర్‌లోని నౌషెరా సెక్టార్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో హిజ్బుల్ ముజాహిద్దీన్ సంస్థకు చెందిన మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్, 'హ్యూమన్ జీపీఎస్'గా పేరుగాంచిన బాగూఖాన్‌ను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. బందిపొరా జిల్లాలోని గురెజ్ సెక్టార్‌లో నియంత్రణ రేఖ వద్ద దేశంలోకి చొరబడేందుకు ప్రయత్నిస్తుండగా జరిగిన ఎన్‌కౌంటర్‌లో బాగూఖాన్‌తో పాటు మరో ఉగ్రవాది కూడా హతమయ్యాడు. నౌషెరా ప్రాంతం నుంచి ఉగ్రవాదులు చొరబడేందుకు ప్రయత్నిస్తున్నట్లు అందిన పక్కా నిఘా సమాచారంతో భారత సైన్యం, జమ్ముకశ్మీర్ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించారు. భద్రతా బలగాలను గమనించిన ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. బలగాలు జరిపిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమైనట్లు భారత సైన్యం 'ఎక్స్' ద్వారా వెల్లడించింది. సంఘటనా స్థలం నుంచి ఇద్దరి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. బాగూఖాన్‌తో పాటు చనిపోయిన మరో ఉగ్రవాదిని ఇంకా గుర్తించాల్సి ఉంది.

1995 నుంచి పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో తలదాచుకుంటున్న బాగూఖాన్, గత 25 ఏళ్లుగా ఉగ్రవాద కార్యకలాపాల్లో చురుగ్గా ఉన్నాడు. సరిహద్దుల గుండా ఉగ్రవాదులను భారత్‌లోకి పంపడంలో ఇతను కీలక పాత్ర పోషించాడు. ఎలాంటి కఠిన మార్గాల్లోనైనా ఉగ్రమూకలు భారత్‌లోకి చొరబడేందుకు ఇతడు సహాయం చేసేవాడు. దారిలోని ప్రతీ అంగుళం తెలిసినవాడు కావడంతో అతడిని 'హ్యూమన్ జీపీఎస్' అని పిలుస్తారు.

Next Story