చిన్నమ్మ కోసం నేతల హంగామా.. రాష్ట్ర రాజకీయాల్లో మార్పులు చోటు చేసుకోనున్నాయా..?

Huge arrangement of leaders for Sasikala. శశికళ ఈనెల 27న జైలు నుంచి విడుదల కానున్నట్లు తెలుస్తోంది. చిన్నమ్మకు స్వాగతం పలికేందుకు అభిమానులు

By Medi Samrat  Published on  26 Jan 2021 12:58 PM GMT
Sasikala

అక్రమ ఆస్తుల విషయంలో జైలు శిక్ష అనుభవిస్తున్న అన్నాడీఎంకే మాజీ నాయకురాలు శశికళ ఈనెల 27న జైలు నుంచి విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో చిన్నమ్మకు స్వాగతం పలికేందుకు అభిమానులు, మద్దతుదారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు చేస్తున్నారు. పరప్పణ అగ్రహారం జైలు నుంచి చెన్నై వరకూ కనీసం వెయ్యి వాహనాలతో ఆమెను ఆహ్వానించేందుకు అమ్మ మక్కల్‌ మున్నేట్రకళగం అధినేత టీటీవీ దినకరన్‌ బృందం ఏర్పాట్లు ముమ్మరం చేస్తోంది. అయితే ఇటీవల ఆమె అనారోగ్యానికి గురవడంతో అభిమానులు, మద్దతుదారులు కాస్త ఆందోళనకు గురయ్యారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం మెరుగు పడింది.

శశికళ జైలు నుంచి విడుదల కాగానే స్వాగతం పలికేందుకు ఇరు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతమైన హూసూరులో ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఆమె బయటకురాగానే స్వాగతం పలికేందుకు మద్దతుదారులు, నేతలు, అభిమానులు బెంగళూరుకు చేరుకోనున్నారు. మరి కొందరు హూసూరులో బస చేసి చిన్నమ్మకు స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కృష్ణగిరి, సేవలం, ధర్మపురి జిల్లాలకు చెందిన కార్యకర్తలు, మద్దతుదారులు, అభిమానులు భారీగా పాల్గొనబోతున్నట్లు సమాచారం. అయితే శశికళ జైలు నుంచి విడుదల కాగానే హూసూరుకు చేరుకున్న తర్వాత శూలగిరిలో కొంత సేపు విశ్రాంతి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఆమె చెన్నైకి బయలుదేరుతారట. శశికళ నగరానికి చేరిన తర్వాత మెరీనాతీరంలోని జయలలిత సమాధి వద్దకు వెళ్లి అంజలి ఘటించే అవకాశం ఉన్నట్లు నేతలు చెబుతున్నారు. అలాగే నగరంలో ఆమె కోసం ప్రత్యేకంగా సిద్దం చేసిన బంగళాకు చేరుకుని కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారని ఆమె అనుచరులు చెబుతున్నారు.

రాష్ట్ర రాజకీయాల్లో మార్పులు చోటు చేసుకోనున్నాయా..?

చిన్నమ్మ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో, అన్నాడీఎంకేలోనూ మార్పులు జరిగే అవకాశం ఉన్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే చిన్నమ్మ క్రియాశీలక రాజకీయాల్లోకి వస్తారా..? లేదా అనేదానిపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే ఒక కేసులో దోషిగా తేలి జైలు శిక్ష అనుభవించిన వారు ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొని పోటీ చేసేందుకు నాలుగేళ్ల వరకు అనర్హులు. దీంతో చిన్నమ్మ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటూనే రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావిస్తున్నట్లు ఆమె సన్నిహితుల ద్వారా సమాచారం. అయితే శశికళకు అనుకున్నది సాధించాలనే పట్టు బాగా ఉంటుంది. తన పంతాన్ని నెగ్గించుకునేందుకు తిరిగి రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు ఏకంగా వచ్చే ఎన్నికల్లో బీజేపీతో జతకట్టాలన్న ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. మరి చిన్నమ్మ జైలు నుంచి విడుదలయ్యాక రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాల్సిందే.


Next Story
Share it