జ్ఞానవాపి కేసులో వారణాసి కోర్టు కీలక తీర్పు
Hindu Petitioners Win A Big Step In Varanasi Court. జ్ఞానవాపి కేసులో వారణాసి కోర్టు కీలక తీర్పును వెలువరించింది.
By Medi Samrat Published on 12 Sept 2022 5:18 PM ISTజ్ఞానవాపి కేసులో వారణాసి కోర్టు కీలక తీర్పును వెలువరించింది. ఈ కేసులో మజీదు కమిటీ అంజుమన్ ఇంతజామియా వేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. కాశీలోని ప్రఖ్యాత విశ్వనాథ ఆలయం పక్కనే జ్ఞానవాపి మసీదు ఆవరణలోని గోడలపై ఉన్న హిందూ దేవతలను పూజించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ అయిదుగురు మహిళలు పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. ఆ పిటిషన్‌ను వారణాసి జిల్లా కోర్టు సమర్థించింది. జ్ఞానవాపి మసీదు వక్ఫ్ ప్రాపర్టీ కిందకు వస్తుందని అంజుమన్ కమిటీ కోర్టులో వాదించింది. వారు వేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టిపారేసింది. హిందువులు వేసిన పిటిషన్ కోర్టులో చెల్లుతుందని కోర్టు చెప్పింది. సెప్టెంబర్ 22వ తేదీన ఈ కేసులో విచారణ ఉంటుందని కోర్టు తెలిపింది. జిల్లా జడ్జి ఏకే విశ్వేశ్ నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం జ్ఞానవాపి కేసులో తీర్పును వెలువరించింది. ముస్లిం పిటిషనర్లు ఈ కేసులో అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించనున్నట్లు పిటీషనర్ సోహన్ లాల్ ఆర్య తెలిపారు.
జ్ఞానవాపి మసీదు వెలుపలి గోడపై ఉన్న హిందూ దేవతలను ప్రతిరోజూ పూజించేందుకు అనుమతి కోరుతూ ఐదుగురు మహిళలు పిటిషన్ దాఖలు చేశారు. ఆలయాన్ని కూల్చివేసి మసీదు నిర్మించారని హిందూ తరపు న్యాయవాది మదన్ మోహన్ యాదవ్ అన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జిల్లా కోర్టు ఈ కేసును విచారిస్తోంది. గతంలో దిగువ కోర్టు కాంప్లెక్స్‌ను వీడియోగ్రఫీ సర్వే చేయాలని ఆదేశించింది. మే 16న సర్వే పనులు పూర్తి చేసి మే 19న కోర్టులో నివేదిక సమర్పించారు. కోర్టు తీర్పు రావడంతో ఉత్తరప్రదేశ్‌లో హైఅలర్ట్ ప్రకటించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్నారు.