భార్య‌పై కాంగ్రెస్ ఆరోప‌ణ‌లు.. తిప్పికొట్టిన సీఎం

కాంగ్రెస్ నాయకులు పవన్ ఖేరా, గౌరవ్ గోగోయ్‌లు నిర్వహించిన విలేకరుల సమావేశంపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ సోమవారం తీవ్రంగా విరుచుకుపడ్డారు.

By -  Medi Samrat
Published on : 6 April 2026 11:52 AM IST

భార్య‌పై కాంగ్రెస్ ఆరోప‌ణ‌లు.. తిప్పికొట్టిన సీఎం

కాంగ్రెస్ నాయకులు పవన్ ఖేరా, గౌరవ్ గోగోయ్‌లు నిర్వహించిన విలేకరుల సమావేశంపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ సోమవారం తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఒక పాకిస్తానీ సోషల్ మీడియా గ్రూప్ అందించిన నకిలీ సమాచారం ఆధారంగా ఈ సమావేశం జరిగిందని ఆయన ఆరోపించారు. తన భార్య రింకీ భూయాన్ శర్మ పేరు మీద బహుళ పాస్‌పోర్టులు, విదేశీ ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలు పూర్తిగా నకిలీవని, ఏఐ ఫోటోషాప్ చేసినవని ఆయన పేర్కొన్నారు.

ఆదివారం ఢిల్లీలో కాంగ్రెస్ నాయకుడు పవన్ ఖేరా నిర్వహించిన విలేకరుల సమావేశంతో ఈ వివాదం మొదలైంది. ముఖ్యమంత్రి భార్య రింకీ భూయాన్ శర్మ వద్ద యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), ఆంటిగ్వా అండ్ బార్బుడా, ఈజిప్ట్ అనే మూడు దేశాల పాస్‌పోర్ట్‌లు ఉన్నాయని ఖేరా ఆరోపించారు. రింకీ భూయాన్ శర్మకు దుబాయ్‌లో ఆస్తి, అమెరికా (వయోమింగ్)లో ఒక కంపెనీ ఉన్నాయని, అయితే ఈ విషయాన్ని ఎన్నికల అఫిడవిట్‌లో ప్రస్తావించలేదని కూడా ఆయన ఆరోపించారు. హిమంత శర్మ రాజకీయాలు ముస్లిం వ్యతిరేక భావనపై ఆధారపడి ఉన్నప్పుడు, ఆయన భార్య రెండు ముస్లిం దేశాల పాస్‌పోర్ట్‌లను ఎలా కలిగి ఉండగలరని ఖేడా ప్రశ్నించారు. భారత చట్టం ప్రకారం ద్వంద్వ పౌరసత్వాన్ని కూడా ఆయన ప్రశ్నించారు.

సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ఈ ఆరోపణలపై స్పందిస్తూ, యూఏఈ పాస్‌పోర్ట్‌ను మొదట ఒక పాకిస్తానీ వ్యక్తి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారని అన్నారు. రినికి శర్మ పేరును చొప్పించడానికి కాంగ్రెస్ ఏఐ ఫోటోషాప్‌ను ఉపయోగించింది. ఈజిప్షియన్ పాస్‌పోర్ట్ కూడా నకిలీది, దీనిని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్‌తో నిర్ధారించుకోవచ్చు. సదరు దుబాయ్ పాస్‌పోర్ట్ నకిలీదని దుబాయ్ ప్రభుత్వ వెబ్‌సైట్ ధృవీకరించింది. భారత ప్రభుత్వం కూడా అది నకిలీదని నిర్ధారించింది. మిగిలిన రెండు పాస్‌పోర్ట్‌లపై నివేదికలు సోమవారం లేదా మంగళవారం నాటికి వెలువడే అవకాశం ఉంది. పాస్‌పోర్ట్‌లో ఉపయోగించిన ఫోటో రింకీ భూయాన్ శర్మది కాదు. పవన్ ఖేరా, గౌరవ్ గోగోయ్‌లు ఢిల్లీ, గౌహతిలలో నిర్వహించిన రెండు పత్రికా సమావేశాలలోని మొత్తం సమాచారాన్ని ఒక పాకిస్తానీ సోషల్ మీడియా గ్రూప్ అందించినట్లు శర్మ ఆరోపించారు.

Next Story