Plane Crash : అజిత్ దాదా.. బాబాయ్ బాటలో ప్రజా సేవలోకి..
బారమతిలో విమానం కుప్పకూలిన ఘటనలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ (66) కన్నుమూశారు.
By - అంజి |
అజిత్ దాదా.. బాబాయ్ బాటలో ప్రజా సేవలోకి..
బారమతిలో విమానం కుప్పకూలిన ఘటనలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ (66) కన్నుమూశారు. బారామతి సభ కోసం ఆయన వెళ్తున్న ఫ్లైట్ ఈ ఉదయం ల్యాండ్ అవుతుండగా కూలిపోయింది. తీవ్రంగా గాయపడిన పవార్ సహా మిగతావారిని వెంటనే ఆస్పత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది.
విమాన ప్రమాదంలో మరణించిన అజిత్ పవార్ సుదీర్ఘ కాలం పాటు డిప్యూటీ సీఎంగా కొనసాగారు. పృథ్వీరాజ్ చవాన్ (కాంగ్రెస్ - ఎన్‌సీపీ), దేవంద్ర ఫడ్నవీస్ (ఎన్డీఏ - 2 సార్లు), ఉద్ధవ్ ఠాక్రే (ఎంవీఏ), ఏక్‌నాథ్ షిండే (ఎండీఏ) ప్రభుత్వాల్లో డిప్యూటీ సీఎంగా పని చేశారు.
బాబాయ్ బాటలో ప్రజా సేవలోకి..
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ సోదరుడి కొడుకైన అజిత్ అనంతరావ్ పవార్ తన బాబాయ్ బాటలో ప్రజాసేవలోకి వచ్చారు. 1959 జులై 22న జన్మించిన అజిత్ మొదట 1982లో షుగర్ ఫ్యాక్టరీ సంఘం ఎన్నికల్లో గెలిచారు. 1991లో బారామతి నుంచి ఎంపీగా చట్ట సభలోకి అడుగుపెట్టారు. అదే ఏడాది బారామతి ఎమ్మెల్యేగా గెలిచి 7 సార్లు ప్రాతినిధ్యం వహించారు. మహారాష్ట్రలో పలు ప్రభుత్వాల్లో మంత్రిగా పని చేశారు.
అజిత్ దాదా..
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ అనంతరావ్ పవార్‌ను ఆయన అభిమానులంతా 'అజిత్ దాదా'గా పిలుచుకునేవారు. పవార్ కుటుంబానికి కంచుకోట అయిన బారామతి నుంచి 1991 నుంచి గెలుస్తూ వస్తున్నారు. గతంలో ఎన్‌సీపీలో కీలక నాయకుడిగా ఉన్న దాదా ఏకంగా ఆరు సార్లు డిప్యూటీ సీఎంగా చేశారు. పొలిటికల్ సర్వైవర్‌గానూ అజిత్ ప్రసిద్ధి. కీలకమైన సమస్యలను సైతం పరిష్కరించడంలో తనదైన ముద్ర వేసేవారు. పవార్ తల్లిదండ్రులు అనంతరావు పవార్, అశాతై పవార్.