మాజీ సీఎం కుమారస్వామికి అస్వస్థత.. హెల్త్ బులెటిన్ విడుదల
కర్ణాటక మాజీ సీఎం హెచ్‌డీ కుమారస్వామి అనారోగ్యంతో అర్థరాత్రి ఆస్పత్రిలో చేరారు.
By Medi Samrat Published on 30 Aug 2023 3:01 PM ISTకర్ణాటక మాజీ సీఎం హెచ్‌డీ కుమారస్వామి అనారోగ్యంతో అర్థరాత్రి ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన జయనగర్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈరోజు తెల్లవారుజామున 3.40 గంటలకు ఒక్కసారిగా అలసట, బలహీనత కారణంగా ఆయన ఆసుపత్రిలో చేరారు. కుమారస్వామి ఆరోగ్యంపై జయనగర్‌లోని అపోలో ఆస్పత్రి హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది.
కుమారస్వామిని జయనగర్‌లోని అపోలో ఆసుపత్రిలో చేర్పించారు. డాక్టర్ పి. సతీష్ చంద్ర బృందం ఆయనను పరీక్షిస్తుందని వెల్లడించింది. బుధవారం తెల్లవారుజామున 3.40 గంటలకు అలసట, బలహీనత కారణంగా కుమారస్వామి ఆస్పత్రికి చేరుకున్నారు. మేము వెంటనే ఆయననకు చికిత్స ప్రారంభించాము. ఆయన చికిత్సకు త్వరగా స్పందించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉంది. వారి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు వైద్యుల బృందం తెలిపింది. హెచ్‌డి కుమారస్వామి ఆరోగ్యానికి సంబంధించిన అన్ని అప్‌డేట్‌లను నిరంతరం అందజేస్తామని అపోలో హాస్పిటల్ హెల్త్ బులెటిన్‌లో తెలిపింది. హెచ్‌డి కుమారస్వామి సతీమణి అనితా కుమారస్వామి కూడా ఆసుపత్రికి వెళ్లారు. దేవెగౌడ దంపతులు కూడా కుమారుడి ఆరోగ్యంపై ఆరా తీసేందుకు ఆస్పత్రికి చేరుకున్నారు.
ఇదిలావుంటే.. మూడు నెలల క్రితం కుమారస్వామికి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీ తరపున ప్రచారం చేస్తూ అలసట కారణంగా జ్వరం వచ్చింది. ఈ సమయంలో హెచ్‌డీ కుమారస్వామికి చిన్నపాటి ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్, డస్ట్ అలర్జీ వచ్చింది. అనంతరం ఆయనను ఆస్పత్రిలో చేర్పించారు. ఎన్నికల ఫలితాల అనంతరం కుమారస్వామి విశ్రాంతి కోసం కుటుంబ సమేతంగా విదేశీ పర్యటనకు వెళ్లారు.