EPFO సభ్యులకు సేవలు మరింత ఈజీ అయ్యాయి. ఇకపై తమ పర్సనల్ డేటెయిల్స్‌ను ఆన్‌లైన్ సొంతంగా సవరించుకోవచ్చు. యజమాని ప్రమేయం లేకుండా సభ్యులు ఈపీఎఫ్ ఖాతా బదిలీకి దరఖాస్తు చేసుకునేలా కేంద్రప్రభుత్వం సేవలను ప్రారంభించింది. అయితే ఇక్కడ ఓ కండీషన్‌ను పెట్టింది. 2017 అక్టోబర్ 1 తర్వాత UAN జారీతో పాటు ఈ-కేవైసీ, ఆధార్ లింక్ పూర్తయిన వారికే ఇది అప్లికేబుల్ అవుతుందని స్పష్టం చేసింది. దీంతో సభ్యుడి పేరు, పుట్టిన తేదీ వంటి వివరాలను సవరించుకునే సదుపాయాన్ని ఈపీఎఫ్‌వో అమల్లోకి తీసుకువచ్చింది. దీని కోసం యాజమాన్య పరిశీలన, ఈపీఎఫ్‌వో ఆమోదం అవసరం లేదని తెలిపింది.
అంతే కాకుండా ఈ-కేవైసీ ఈపీఎఫ్ (ఆధార్ సీడెడ్) అకౌంట్ ఉన్న ఈపీఎఫ్‌వో అకౌంట్ హోల్డర్స్ సొంతంగా ఆధార్ ఓటీపీ సాయంతో తమ భవిష్య నిధి బదిలీ క్లెయిమ్‌లను యాజమాన్యం ప్రమేయం లేకుండానే ఆన్‌లైన్‌లో ఫైల్ చేసుకోవచ్చు. కేంద్ర కార్మిక, ఉపాధిశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ఈ రెండు సౌకర్యాలను శనివారం ప్రారంభించారు. ఖాతాదారుల ఫిర్యాదుల్లో 27 శాతం వారి ప్రొఫైల్/ కేవైసీలకు సంబంధించినవేనని, తాజా సదుపాయాలతో ఆ సమస్య సమసిపోతుందని ఆయన తెలిపారు. ఖాతాదారుల నుంచి ఇలాంటి ఫిర్యాదులు అధిక సంఖ్యలో ఎదుర్కొంటున్న పెద్ద సంస్థలకూ ఇది ప్రయోజనం చేకూరుస్తుందని వెల్లడించారు.
కొత్తగా కల్పించిన సదుపాయంతో అకౌంట్ హోల్డర్ పేరు, పుట్టిన తేదీ, జెండర్, జాతీయత, తండ్రి/తల్లి పేరు, వైవాహిక స్థాయి, భాగస్వామి పేరు, సంస్థలో చేరిన తేదీ, సంస్థను వదిలిన తేదీ వంటి వివరాలను ఈపీఎఫ్‌వో పోర్టల్‌లో స్వయంగా సవరించుకోవచ్చు. ఈ ఏర్పాటు ద్వారా జాయింట్ డిక్లరేషన్ పద్ధతిని సరళీకరించినట్లు కేంద్రమంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. ఉద్యోగులు తమ వివరాలను సమర్పించుకునేందుకు ఎలాంటి డాక్యుమెంట్స్ సమర్పించాల్సిన పని లేదని ఆయన చెప్పారు. 2017 అక్టోబర్ 1వ తేదీకి ముందు UAN జారీ అయి ఉంటే తన ఉద్యోగి వివరాలను ఈపీఎఫ్‌వో పర్మిషన్‌తో యజమాని సవరించవచ్చని తెలిపారు.