హర్యానాలో 15వ అసెంబ్లీ ఏర్పాటు, కొత్త ప్రభుత్వం ఎన్నిక నిమిత్తం ఓటర్లు నేడు పోలింగ్‌లో పాల్గొననున్నారు. శనివారం ఉదయం సరిగ్గా 7 గంటలకు మొత్తం 90 స్థానాలకు ఓటింగ్ ప్రారంభమవుతుంది. సాయంత్రం 7 గంటల పోలింగ్ జరుగనుంది. కాగా.. నిర్ణీత సమయం ముగిసిన తర్వాత కూడా పోలింగ్ స్టేషన్ల వద్ద క్యూలలో నిలబడి ఉన్న ప్రజలు ఓటు వేయడానికి అనుమతిని ఇస్తారు.
పోలింగ్ నేపథ్యంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు సెలవు ప్రకటించారు. అక్టోబర్ 8న ఓట్ల లెక్కింపు జరగనుంది. 60 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది.
ఎన్నికల కోసం 225 కంపెనీల కేంద్ర సాయుధ పోలీసు బలగాలు భద్రతను నిర్వహించనున్నాయి. 500 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను మోహరించారు. శనివారం సాయంత్రం నాటికి మొత్తం 1,031 మంది అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమవుతుంది. అందులో 930 మంది పురుషులు, 101 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. 462 మంది స్వతంత్ర అభ్యర్థులు కూడా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.
2019 అసెంబ్లీ ఎన్నికల్లో 68.31 శాతం ఓటింగ్ నమోదైంది. ఈసారి ఎన్నికల సంఘం 75 శాతం ఓటింగ్ లక్ష్యంగా పెట్టుకుంది. అయితే మేలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో 64.80 శాతం ఓటింగ్ నమోదైంది, ఈ నేపథ్యంలో ఓటింగ్ శాతాన్ని పెంచడం ఎన్నికల సంఘానికి సవాలుగా మారింది.