సైలెన్సర్లను రోడ్ రోలర్‌తో ధ్వంసం చేశారు..!

కంపెనీలు ఇచ్చిన సైలెన్సర్లను వాడకుండా ఇష్టమొచ్చిన సైలెన్సర్లను వాడుతూ ఉంటారు కొందరు. వాటితో విపరీతమైన శబ్ద కాలుష్యం నెలకొంటూ ఉంటుంది

By Medi Samrat  Published on  6 May 2024 3:45 PM GMT
సైలెన్సర్లను రోడ్ రోలర్‌తో ధ్వంసం చేశారు..!

కంపెనీలు ఇచ్చిన సైలెన్సర్లను వాడకుండా ఇష్టమొచ్చిన సైలెన్సర్లను వాడుతూ ఉంటారు కొందరు. వాటితో విపరీతమైన శబ్ద కాలుష్యం నెలకొంటూ ఉంటుంది. నిబంధనలు ఉల్లంఘించి మరీ సైలెన్సర్లను వాడితే అధికారులు చర్యలు తీసుకుంటూ ఉంటారు. కొన్ని ప్రాంతాల్లో పోలీసులు రోడ్ రోలర్లతో సైలెన్సర్లను తొక్కిస్తూ ఉంటారు. అలాంటి ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్‌లో శబ్ధ కాలుష్యాన్ని సృష్టిస్తున్నందుకు రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లకు చెందిన మొత్తం 509 మోడిఫైడ్ సైలెన్సర్‌లను స్వాధీనం చేసుకున్నారు. జనవరి, ఏప్రిల్ మధ్య హాపూర్ పోలీసులు ఆపరేషన్ "పటాఖా" అనే ప్రచారాన్ని నిర్వహించారు. గత 4నెలలుగా సీజ్ చేసిన వాహనాల సైలెన్సర్‌లు రోడ్డు రోలర్‌ కింద నుజ్జునుజ్జయ్యాయి. రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లలో మోడిఫైడ్ సైలెన్సర్‌లను అమర్చి, శబ్ద కాలుష్యానికి కారణమై నిబంధనలను ఉల్లంఘించిన వాహనదారులపై పోలీసులు కొరడా ఝులిపించారు. సర్కిల్ ఆఫీసర్ వరుణ్ మిశ్రా మాట్లాడుతూ.. జనవరి నుండి ఏప్రిల్ వరకు హాపూర్‌లో ఆపరేషన్ 'పటాఖా' నిర్వహించామని, మోడిఫైడ్ సైలెన్సర్‌లను అమర్చి శబ్ద కాలుష్యానికి కారణమైన రాయల్ ఎన్‌ఫీల్డ్ వాహనాల సైలెన్సర్‌లను సీజ్ చేశామని తెలిపారు. అలాంటి 509 సైలెన్సర్‌లను రోడ్డు రోలర్ల సహాయంతో ధ్వంసం చేశారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసిన నెటిజన్లు ఇకపైన మీ వాహనాలకు ఇలాంటి సైలెన్సర్లు ఫిక్స్ చేసే ముందు ఆలోచించాలని సూచించారు. పలు నగరాలకు చెందిన వ్యక్తులు.. తమ ప్రాంతంలో కూడా ఇలాంటి పని చేస్తే బాగుంటుందని కోరుతున్నారు.

Next Story