పలువురు మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న తన కుమారుడు ప్రజ్వల్ రేవణ్ణ ఏదైనా నేరం చేసి ఉంటే ఉరితీయాలని జేడీఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హెచ్‌డీ రేవణ్ణ అన్నారు. "నా కొడుకు ఏదైనా నేరం చేసి ఉంటే ఉరి తీయండి. నేను దానిని వ్యతిరేకించను. అయితే, నేను ఈ విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నాను. ఈ సమస్యను సమర్థించడానికి లేదా చర్చించడానికి నేను ఇక్కడ లేను" అని ఆయన మంగళవారం రాష్ట్ర అసెంబ్లీలో అన్నారు.
అధికార కాంగ్రెస్‌పై విరుచుకుపడిన జేడీఎస్ ఎమ్మెల్యే హెచ్‌డీ రేవణ్ణ ''నేను 25 సంవత్సరాలు శాసనసభ్యునిగా పనిచేశాను. 40 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నాను. డీజీపీ ఒక మహిళను తన కార్యాలయానికి పిలిపించి, నాపై ఆమె నుండి ఫిర్యాదు పొందాడు. డీజీపీ ఆ పదవికి అనర్హుడు'' అని అన్నారు.
దీంతో ఆగ్రహించిన కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే రేవణ్ణ తన కుమారుడు ఘోరమైన నేరానికి పాల్పడ్డాడని, వ్యాఖ్యలు చేసే హక్కు ఆయనకు లేదని మండిపడ్డారు. ‘మాజీ ఎంపీ (ఆయన కుమారుడు ప్రజ్వల్ రేవణ్ణ) చేసింది కరెక్టేనా?.. బాధితురాలు ఫిర్యాదు తీసుకోవడం తప్పా’ అని జేడీఎస్ నేతను కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రశ్నించారు.
ఈ విషయమై స్పీకర్‌కు నోటీసు సమర్పించాలని ఎమ్మెల్యే రేవణ్ణను ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కోరారు. "డిజిపిపై వచ్చిన ఆరోపణలను చర్చకు తీసుకోనివ్వండి" అని ఆయన అన్నారు. అధికారిపై రేవణ్ణ ఆరోపణలు చేస్తున్నారు.. అన్యాయానికి గురైన వారి మాట విననివ్వండి.. ఈ అంశాన్ని సభలో లేవనెత్తే అవకాశం ఇవ్వండి అని డిప్యూటీ సీఎం అన్నారు.