గుజరాత్‌లోని జామ్‌నగర్ సమీపంలో భారత వైమానిక దళానికి చెందిన జాగ్వార్ యుద్ధ విమానం సాధారణ శిక్షణా కార్యక్రమంలో బుధవారం రాత్రి కూలిపోయింది. ఈ ప్రమాదంలో హర్యానాలోని రేవారీకి చెందిన 28 ఏళ్ల పైలట్ ఫ్లైట్ లెఫ్టినెంట్ సిద్ధార్థ్ యాదవ్ ప్రాణాలు కోల్పోయాడు. ఆయనకు కొద్దిరోజుల క్రితమే నిశ్చితార్థం జరిగింది. కాగా నవంబర్ నెలలో వివాహం జరగాల్సి ఉంది. ఇంతలోనే ఈ ఊహించని ప్రమాదంతో ఫ్లైట్ లెఫ్టినెంట్ కుటుంబంలో విషాదం నెలకొంది.
ఫ్లైట్ లెఫ్టినెంట్ సిద్ధార్థ్ యాదవ్, అతని కో-పైలట్ విమానం జన సమూహం ఉన్న ప్రాంతాలకు దూరంగా బహిరంగ ప్రదేశంలో కూలిపోయేలా చూసుకున్నారు. ఈ ప్రమాదంలో ప్రజలకు ప్రాణనష్టం జరగకుండా నిరోధించారు. ఈ ప్రమాదంలో సిద్ధార్థ్ యాదవ్ కో-పైలట్ సురక్షితంగా బయటపడగలిగాడు, ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. అయితే, సిద్ధార్థ్ ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు.
ప్రమాదానికి పది రోజుల ముందు మార్చి 23న సిద్ధార్థ్ నిశ్చితార్థం జరిగింది. అతని వివాహం నవంబర్ 2న జరగాల్సి ఉంది. అతను ఇటీవలే రేవారీలో తన కుటుంబంతో గడిపిన తర్వాత మార్చి 31న విధులకు తిరిగి వచ్చాడు. ఆయన మరణ వార్త ఆయన కుటుంబ సభ్యులను, స్నేహితులను శోకసంద్రంలో ముంచెత్తింది.