భారత్ కు సంబంధించిన సమాచారాన్ని పాక్ కు అందిస్తున్న బీఎస్ఎఫ్ జవాన్ అడ్డంగా దొరికిపోయాడు. పాక్ కు సున్నితమైన సమాచారం పంపిస్తున్నాడన్న అభియోగంపై బీఎస్ఎఫ్ జవాన్‌ను గుజరాత్ ఉగ్రవాద వ్యతిరేక దళం (ఏటీఎస్) పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. నిందితుడుని మహ్మద్ సజ్జాద్ గా గుర్తించారు. జమ్ముకశ్మీర్‌లోని రాజౌరి జిల్లా సరూలా గ్రామానికి చెందిన వ్యక్తి అని పోలీసులు తెలిపారు. గుజరాత్‌లోని కచ్ జిల్లా భుజ్ వద్ద విధులు నిర్వర్తిస్తున్నాడు. వాట్సాప్‌లో మెసేజింగ్ ద్వారా పాక్‌కు సున్నితమైన సమాచారం పంపుతున్నాడని మహ్మద్ సజ్జాద్‌పై అభియోగం మోపబడింది.
బీఎస్ఎఫ్‌లో చేరడానికి ముందు పాక్ కు వెళ్లిన మహ్మద్ సజ్జాద్ అక్కడ 46 రోజులు ఉన్నాడు. 2011 డిసెంబర్ ఒకటో తేదీన అట్టారీ రైల్వే స్టేషన్ నుంచి సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌లో పాక్ కు వెళ్లాడు. జమ్మూలో పాస్‌పోర్ట్ రిజిస్టర్ అయి ఉంది. సజ్జాద్ వాట్సాప్ మెసేజ్‌లు పంపుతున్న సెల్‌ఫోన్, అతడి ఆధార్ నంబర్‌పై రిజిస్టరైంది.కచ్-భుజ్ బీఎస్ఎఫ్ హెడ్ క్వార్టర్స్‌లో సజ్జాద్‌ను అరెస్ట్ చేసిన ఏటీఎస్ పోలీసులు అతడి వద్ద నుంచి రెండు మొబైల్ ఫోన్ సిమ్ కార్డులు, రెండు అదనపు సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు.