ఢిల్లీలో తీవ్ర గాలికాలుష్యం..50 శాతం మందితోనే ఆఫీసులు, హైబ్రిడ్ మోడ్‌లో స్కూళ్లు
ఢిల్లీ–ఎన్‌సీఆర్ ప్రాంతంలో గాలికాలుష్యం తీవ్ర స్థాయికి చేరడంతో అధికారులు గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (GRAP)లోని అత్యంత కఠినమైన స్టేజ్–IV ఆంక్షలను అమలు చేశారు.
By - Knakam Karthik |
ఢిల్లీలో తీవ్ర గాలికాలుష్యం..50 శాతం మందితోనే ఆఫీసులు, హైబ్రిడ్ మోడ్‌లో స్కూళ్లు
ఢిల్లీ: ఢిల్లీ–ఎన్‌సీఆర్ ప్రాంతంలో గాలికాలుష్యం తీవ్ర స్థాయికి చేరడంతో అధికారులు గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (GRAP)లోని అత్యంత కఠినమైన స్టేజ్–IV ఆంక్షలను అమలు చేశారు. కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ (CAQM) రియల్‌టైమ్ డేటాను పరిశీలించి చర్యలు చేపట్టింది. శనివారం సాయంత్రం 4 గంటల సమయంలో AQI 431గా ఉండగా, 6 గంటలకు 441కి చేరింది. డిసెంబర్ 14 అర్ధరాత్రి 12 గంటలకల్లా AQI 460కు చేరి ‘సీవియర్ ప్లస్’ స్థాయిని దాటినట్లు సీపీసీబీ (CPCB) వెల్లడించింది.
AQI 201–300 ‘పూర్’, 301–400 ‘వెరీ పూర్’, 401 దాటితే ‘సీవియర్’, 450కు పైగా ఉంటే ‘సీవియర్ ప్లస్’గా వర్గీకరిస్తారు. ప్రస్తుతం ఢిల్లీ ఈ అత్యంత ప్రమాదకర స్థాయిలోకి వెళ్లింది. సాయంత్రం నాటికి ఆనంద్ విహార్ ప్రాంతం దట్టమైన విషపూరిత పొగమంచుతో కప్పబడింది. అక్కడ AQI 488కి చేరింది. ఇండియా గేట్, కర్తవ్య పథ్ ప్రాంతాల్లోనూ దట్టమైన స్మాగ్ కమ్ముకుని AQI 407గా నమోదైంది. పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని CAQM ఉపసంఘం GRAP–IV కింద అన్ని చర్యలను తక్షణమే అమల్లోకి తెచ్చింది.
ఢిల్లీ అంతటా నిర్మాణ, కూల్చివేత పనులపై సంపూర్ణ నిషేధం
రాయి క్రషర్లు, గనులు మరియు సంబంధిత కార్యకలాపాలన్నింటి మూసివేత
క్లాస్ 5 వరకు పాఠశాలలు హైబ్రిడ్ విధానంలో (ఆన్‌లైన్ + ఆఫ్‌లైన్) నిర్వహణ
BS–III పెట్రోల్, BS–IV డీజిల్ నాలుగు చక్రాల వాహనాలపై కఠిన పరిమితులు
ఈ వాహన పరిమితులు ఢిల్లీతో పాటు గురుగ్రామ్, ఫరీదాబాద్, ఘాజియాబాద్, గౌతమ్ బుద్ధ నగర్ జిల్లాల్లో కూడా అమలు
అదనంగా, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు 50 శాతం సామర్థ్యంతోనే పనిచేయాలి, మిగతా సిబ్బంది వర్క్ ఫ్రం హోమ్ చేయాలని ఆదేశించారు. ఈ ఉత్తర్వులు పర్యావరణ పరిరక్షణ చట్టం–1986 (సెక్షన్ 5) కింద జారీ అయ్యాయి. కాలుష్య నియంత్రణ బోర్డులు, పౌర సంస్థలు, అమలు బృందాలు నిబంధనల అమలును కఠినంగా పర్యవేక్షించాలని CAQM ఆదేశించింది. ఉల్లంఘనలపై తక్షణమే జరిమానాలు విధించాలని, క్షేత్రస్థాయిలో తనిఖీలు పెంచాలని సూచించింది. ఉదయం తొందరగా, సాయంత్రం వేళల్లో బయటకు వెళ్లడాన్ని తగ్గించాలని ప్రజలకు సూచించారు. ఆరోగ్య శాఖ, పౌర సంస్థలు జారీ చేసే మార్గదర్శకాలను పాటించాలని కోరారు.