ఢిల్లీ నుంచి పిలుపు రాలేదు.. కానీ ఆ టైమ్‌కి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం: శివకుమార్

ముఖ్యమంత్రి పదవికి బలమైన పోటీదారు, కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కెపిసిసి) అధ్యక్షుడు డికె శివకుమార్.. సీఎం సీటు కేటాయింపు

By అంజి  Published on  15 May 2023 7:19 AM GMT
Congress, Karnataka, KPCC president, DK Shivakumar

ఢిల్లీ నుంచి పిలుపు రాలేదు.. కానీ ఆ టైమ్‌కి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం: శివకుమార్

బెంగళూరు: ముఖ్యమంత్రి పదవికి బలమైన పోటీదారు, కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కెపిసిసి) అధ్యక్షుడు డికె శివకుమార్.. సీఎం సీటు కేటాయింపు అంశంపై చర్చించడానికి పార్టీ కేంద్ర నాయకత్వం నుండి తనకు ఎటువంటి పిలుపు రాలేదని అన్నారు. మిమ్మల్ని ముఖ్యమంత్రిగా నియమిస్తారా అని ప్రశ్నించగా.. 'నాకు తెలియదు.. ఏ పని ఇచ్చినా చేశాను.. ఢిల్లీకి ఒక లైన్‌ తీర్మానం పంపాం' అని అన్నారు. శుభ ముహూర్తంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. తనను దేశ రాజధానికి రావాల్సిందిగా హైకమాండ్ కోరిందనే ఊహాగానాల మధ్య ఆయన స్పందించారు.

"నాకు ఇంకా ఎలాంటి కాల్ రాలేదు. చూద్దాం" అని అన్నారు. కొత్త ప్రభుత్వం ఎప్పుడు ఏర్పడుతుందనే దానిపై శివకుమార్ మాట్లాడుతూ.. ''మేము వారంలో ఒక శుభ దినం, శుభ ముహూర్తం చూస్తాము'' అని అన్నారు. మే 10వ తేదీన జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘనవిజయం తనకు ప్రజలు ఇచ్చిన ఉత్తమ పుట్టినరోజు కానుక అని కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ అన్నారు. కర్ణాటక ప్రజలకు సేవ చేయడానికే తన జీవితం అంకితం చేశానని శివకుమార్ అన్నారు. ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన సోమవారం తన 62వ పుట్టినరోజు జరుపుకున్నారు.

ముఖ్యమంత్రి పదవి కోసం పార్టీ సీనియర్ నేత సిద్ధరామయ్యతో శివకుమార్ తీవ్ర పోటీలో ఉన్నారు. ఆదివారం జరిగిన కర్ణాటక కాంగ్రెస్ లెజిస్లేర్ పార్టీ సమావేశంలో రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకునే అధికారం ఏఐసీసీ అధ్యక్షుడు ఎం. మల్లికార్జున్ ఖర్గేకు ఇస్తూ ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. 224 మంది సభ్యుల సభకు మే 10న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 135, బీజేపీ 66, జేడీ(ఎస్) 19 సీట్లు గెలుచుకున్నాయి. ఫలితాలు మే 13న వెలువడ్డాయి.

Next Story