ఇంధనంపై అధిక పన్నులు విధించడం ద్వారా కేంద్రం ప్రజలను నష్టాలపాలు చేస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం మంగళవారం ఆరోపించారు. పెట్రోలు, డీజిల్ ధరలు కృత్రిమంగా పెంచడం ద్రవ్యోల్బణం పెరగడానికి ఒక కారణమని ఆయన అన్నారు. UPA, NDA ప్రభుత్వాల హయాంలో 2010, 2014 మధ్య కాలంలో పెట్రోల్ ధరలపై నియంత్రణ ఎత్తివేయబడిందని పేర్కొన్న ఒక ఆంగ్ల వార్తాపత్రిక సంపాదకీయాన్ని చదవవలసిందిగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు చిదంబరం సూచించారు.
నివేదిక ప్రకారం 2014 నుంచి 2021 మధ్య ముడి చమురు ధరలు $60 కంటే తక్కువగా ఉన్నాయి, ఫిబ్రవరి 2022లో రష్యా ఉక్రెయిన్‌పై దాడి చేసినప్పుడు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. అయితే మళ్లీ $75కి పడిపోయాయి. అయినప్పటికీ.. ముడి చమురు ధరల తగ్గింపు ప్రయోజనాన్ని పెట్రోల్, డీజిల్ వినియోగించే వినియోగదారులకు ప్రభుత్వం అందించలేదని అన్నారు.
అధిక పన్నులు, సెస్‌ల ద్వారా సామాన్య ప్రజలపై భారం వేస్తూ.. ప్రభుత్వం లబ్ధి పొందుతుందని అన్నారు. పెట్రోలు, డీజిల్ ధరలు కృత్రిమంగా పెంచడం ద్రవ్యోల్బణం పెరగడానికి ఒక కారణమని, తక్కువ ముడి చమురు ధరల ప్రయోజనాలను కేంద్ర ప్రభుత్వం వినియోగదారులకు అందించి.. ఉపశమనం కలిగించాలని డిమాండ్ చేశారు.