జాతీయ భద్రత దృష్ట్యా రక్షణ కార్యకలాపాలు, భద్రతా దళాల కదలికలకు సంబంధించిన వార్తలను ప్రత్యక్ష ప్రసారం చేయకుండా ఉండాలని సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ (I&B) అన్ని మీడియా ఛానెళ్లకు సూచనలు జారీ చేసింది. జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది మరణించిన తర్వాత భారత రక్షణ వ్యవస్థలు అలర్ట్ అయ్యాయి. ఈ హెచ్చరికల తరువాత రక్షణపరమైన విషయాలపై పలు మీడియా సంస్థలు నివేదికలు ప్రసారం చేశాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నుండి ఈ సలహా వచ్చింది.
"జాతీయ భద్రత దృష్ట్యా, అన్ని మీడియా ప్లాట్‌ఫారమ్‌లు, వార్తా సంస్థలు, సోషల్ మీడియా వినియోగదారులు రక్షణ, ఇతర భద్రతా సంబంధిత కార్యకలాపాలకు సంబంధించిన విషయాలను నివేదించేటప్పుడు అత్యంత బాధ్యత వహించాలని, ప్రస్తుత చట్టాలు, నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని సూచిస్తున్నాం" అని సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ అడ్వైజరీని జారీ చేసింది. రక్షణ కార్యకలాపాలు లేదా కదలికలకు సంబంధించిన రియల్-టైమ్ కవరేజ్ కు దూరంగా ఉండాలని సూచించింది.