మహమ్మారి కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ సాగుతోంది. ఈ నేపథ్యంలోనే వ్యాక్సిన్ అందని దేశాలకు సాయం చేసేందుకు కోవాక్స్ గ్లోబల్ వ్యాక్సినేషన్ అనే కార్యక్రమాన్ని ఐక్యరాజ్యసమితి ప్రారంభించింది. వ్యాక్సిన్ అందని దేశాలకు ఈ కార్యక్రమం ద్వారా వ్యాక్సిన్లను సేకరించి పంపిణీ చేయనున్నారు. పేద దేశాలకు బాసటగా నిలిచేందుకు యూఎన్‌వో ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ నేపథ్యంలోనే భారతదేశానికి చెందిన ప్రముఖ ఫార్మ దిగ్గజం సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో ఇప్పటికే కోవిషీల్డ్ డోసుల స్టాక్ చాలా పెరిగింది. యూఎన్‌వో చేపట్టిన కోవాక్స్ కార్యక్రమంలో పాల్గొని పలు దేశాలకు వ్యాక్సిన్లను అందించేందుకు ముందుకువచ్చింది.
కోవాక్స్ గ్లోబల్ వ్యాక్సిన్ కార్యక్రమం ద్వారా 50 లక్షల డోసుల కోవిషీల్డ్ వ్యాక్సిన్లను 4 దేశాలకు ఎగుమతి చేసేందుకు కేంద్ర ప్రభుత్వానికి సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా విన్నవించింది. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. వ్యాక్సిన్ల ఎగుమతికి అంగీకరించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మొజాంబిక్, బంగ్లాదేశ్, నేపాల్, తజికిస్తాన్ దేశాలకు వ్యాక్సిన్లను ఎగుమతి చేయనున్నట్లు సీరం ఇనిస్టిట్యూట్ తెలిపింది. సీరం సంస్థ 24,89,15,00 డోస్‌ల స్టాక్‌ను తయారు చేసిందని ఎస్‌ఐఐలోని ప్రభుత్వ నియంత్రణ వ్యవహారాల డైరెక్టర్ ప్రకాష్ కుమార్ సింగ్ ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి తెలిపారు. వాటిని తొరగా పంపిణీ చేయకుంటే మా కంపెనీకి అవాంతరాలు ఎదురవుతాయని కేంద్రం ప్రభుత్వానికి విన్నవించింది. వాటిని కోవాక్స్ కార్యక్రమంలో భాగంగా వివిధ దేశాలకు ఎగుమతి చేసేందుకు అనుమతించాలని కోరింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది.