ఇటీవల కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దేశంలో కేంద్రం సీఏఏ (సిటిజన్‌షిప్ అమెండ్‌మెంట్ యాక్ట్)ను నోటిఫై చేసింది. ఈ చట్టం ఇప్పటికే అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలోనే భారత పౌరసత్వం పొందాలని భావించే పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆప్ఘానిస్తాన్ శరణార్థుల కోసం ప్రత్యేక పోర్టల్‌ను ప్రారంభించింది. indiancitizenshiponline.nic.in పేరిట కొత్త పోర్టల్‌ను తీసుకొచ్చింది. కాగా దరఖాస్తుదారులు 2014 లోపే భారత్‌కు వచ్చినట్టుగా ఆధారాలు చూపాల్సి ఉంటుంది. సిటిజన్‌షిప్ అమెండ్‌మెంట్ యాక్ట్ బిల్లు 2019 డిసెంబర్ 11న పార్లమెంటు ఆమోదం పొందినా దేశవ్యాప్త నిరసనలతో అమలు చేయలేదు.
ఎన్నికలకు ముందే సీఏఏ తెస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఇటీవలే తెలిపారు. ఈ చట్టం పాకిస్తాన్, ఆప్ఘాన్, బంగ్లాదేశ్‌ల నుంచి 2014 లోపు భారతదేశంలోకి వచ్చిన ముస్లిమేతరులకు పౌరసత్వం ఇస్తుంది. ఇదిలా ఉంటే.. సీఏఏ అమలుపై స్టే మంజూరు చేయాలని కోరుతూ మంగళవారం సుప్రీంకోర్టులో వ్యాజ్యాలు దాఖలయ్యాయి. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (ఐయూఎంఎల్)తో పాటు, డెమొక్రాటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డీవైఎ్‌ఫఐ)లు ఈ పిటిషన్లు వేశాయి. సీఏఏ-2019 రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై తీర్పు వెలువరించే వరకు ఈ నిబంధనల అమలును వాయిదా వేయాలని ఐయూఎంఎల్ తన పిటిషన్‌లో కోరింది.