అంగన్‌వాడీ కార్యకర్తలకు ప్రభుత్వం శుభవార్త..!
హర్యానాలో అంగన్‌వాడీ కార్యకర్తల గౌరవ వేతనం రూ.750, హెల్పర్లకు నెలకు రూ.400 చొప్పున పెంచారు.
By Medi Samrat Published on 14 Oct 2024 3:45 PM GMTహర్యానాలో అంగన్‌వాడీ కార్యకర్తల గౌరవ వేతనం రూ.750, హెల్పర్లకు నెలకు రూ.400 చొప్పున పెంచారు. 10 ఏళ్ల అనుభవం ఉన్న అంగన్‌వాడీ కార్యకర్తలకు రూ.14 వేల 750, పదేళ్లలోపు అనుభవం ఉన్న అంగన్‌వాడీ కార్యకర్తలు, మినీ అంగన్‌వాడీ కార్యకర్తలకు రూ.13 వేల 250, సహాయకులకు రూ.7,900 గౌరవ వేతనం అందజేయనున్నారు. ఆర్థిక శాఖ ఆమోదం అనంతరం మహిళా శిశు అభివృద్ధి శాఖ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకుల గౌరవ వేతనాన్ని ఆగస్టు 9న పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి నాయబ్‌సింగ్ సైనీ ప్రకటించారు. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో అంగన్‌వాడీ కార్యకర్తలు ముఖ్యమంత్రి ప్రకటన ఎప్పుడు నెరవేరుతుందా అని ఎదురుచూడాల్సి వచ్చింది. అయితే.. పెంచిన గౌరవ వేతనం ఆగస్టు 16 నుంచి అందుబాటులోకి వస్తుండటం ఊరటనిచ్చే అంశం.
పెరిగిన గౌరవ వేతనంతో రాష్ట్రంలోని 23, 486 మంది అంగన్‌వాడీ కార్యకర్తలు, 489 మంది మినీ అంగన్‌వాడీ కార్యకర్తలు, 21, 732 మంది అంగన్‌వాడీ సహాయకులు లబ్ధి పొందనున్నారు. అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకులకు అత్యధిక గౌరవ వేతనం ఇచ్చే రాష్ట్రంగా హర్యానా అవతరించింది. ఇప్పటి వరకు పదేళ్ల అనుభవం ఉన్న అంగన్‌వాడీ కార్యకర్తల వేతనం రూ.14 వేలు కాగా.. ఇప్పుడు రూ.750 పెంచి రూ.14 వేల 750కి పెంచారు. పదేళ్ల అనుభవం ఉన్న అంగన్‌వాడీ వర్కర్లు, మినీ అంగన్‌వాడీ కార్యకర్తలకు ఇప్పటి వరకు రూ.12,500 అందజేస్తుండగా, ఇప్పుడు ప్రతి నెలా రూ.13,250 అందనుంది. అంగన్‌వాడీ హెల్పర్‌లకు రూ.7,500 బదులు రూ.7,900 అందజేయనున్నారు.