గత కొన్ని నెలలుగా నిత్యావసరాల ధరలు ఆకాశనంటుతుండటంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే వంట నూనె తయారీ సంస్థలు ఊరట కలిగించే వార్త చెప్పాయి. అంతర్జాతీయంగా వంట నూనె ధరలు తగ్గాయి. ఈ ప్రయోజనాలను వినియోగదారులకు అందించేందుకు వంట నూనె తయారీ సంస్థలు అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది. కేంద్ర ఆహార, వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారులతో వంట నూనె తయారీ సంస్థల ప్రతినిధులు గురువారం సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో.. అంతర్జాతీయంగా వంట నూనె ధరలు తగ్గాయని, భారత్‌లో కూడా ధరలను తగ్గించాలని వంట నూనె తయారీ సంస్థలను కేంద్రం కోరింది.
ఇందుకు ఆయా కంపెనీలు అంగీకారం తెలిపాయని సమాచారం. దీనిపై నేషనల్ మీడియా కథనాలు రాసింది. రాబోయే రెండు వారాల్లో అన్ని ప్రధాన బ్రాండ్‌ల వంట నూనెల ధరపై లీటర్‌కు రూ.10-12 ధర తగ్గే ఛాన్స్ ఉన్నట్లు కనిపిస్తోంది. వంటనూనె తయారీ సంస్థల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో.. కేంద్ర ఆహార కార్యదర్శి సుధాన్షు పాండే 15 రోజుల్లోగా ఎంఆర్‌పీ లీటర్‌కు 10-12 రూపాయలు తగ్గించాలని కంపెనీలను కోరినట్లు సమావేశానికి హాజరైన అధికారులు చెప్పినట్లు నివేదికలు తెలిపాయి. దీంతో ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని తెలుస్తోంది. వంటనూనెల ధరలు గత రెండేళ్లుగా కొత్త రికార్డులను నెలకొల్పుతున్నాయి.