సాధారణంగా చిన్న పిల్లల జన్మదిన వేడుకల్లో కేక్ కట్ చేయడం, డీజే పెట్టుకుని డ్యాన్స్‌లు చేస్తూ వేడుకగా జరుపుకుంటారు. ఇంట్లో పెంపుడు జంతువులకు పుట్టిన రోజు వేడుకలను జరపడం మనం చూసి ఉంటాం. అయితే ఓ వ్యక్తి మాత్రం తన దగ్గర ఉన్న రెండు మేక పిల్లలకు పుట్టిన రోజు వేడుకలు నిర్వహించాడు. ఈ విచిత్ర సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని బాందా నగరంలోని కాన్షీరామ్ కాలనీలో సోమవారం జరిగింది. బాందాకు చెందిన రిక్షా డ్రైవర్ రాజు.. తన దగ్గరున్న మేక పిల్లల బర్త్ డేను వేడుకగా చేశాడు. అంతే కాకుండా మేక పిల్లలకు పూల మాలలు వేసి ఘనంగా జన్మదిన వేడుకలు జరుపుకున్నాడు.
గ్రామంలోని ప్రజలను కూడా బర్త్ డే పార్టీలో చేర్చుకున్నాడు. డీజే పెట్టి మరీ పాటలు, డ్యాన్స్‌లతో హోరెత్తించాడు. బంధువులతో కలిసి మేక పిల్లలతో కేక్ కట్ చేయించాడు. తనకు పిల్లలు లేరని, ఈ రెండు మేకలనే తన పిల్లలుగా భావిస్తున్నానని రిక్షా డ్రైవర్ రాజు చెప్పాడు. ''ఈ రోజు ఈ మేక పిల్లలు మొదటి పుట్టిన రోజును జరుపుకున్నాయి. వీటిని నా సొంత పిల్లలగా చూసుకుంటున్నాను. ఈ మేక పిల్లలను రిక్షాలో కూర్చోబెట్టుకుని రోజంతా ప్రయాణిస్తాను'' అని రాజు చెప్పాడు. ప్రస్తుతం మేక పిల్లల బర్త్ డే వార్త నెట్టింట వైరల్‌గా మారింది.