వాణిజ్యం ఒత్తిడి లేకుండా ఉండాలి..ఆర్ఎస్ఎస్ చీఫ్ ఆసక్తికర కామెంట్స్
అంతర్జాతీయ వాణిజ్యం ఒత్తిడిలేని స్వచ్ఛంద సహకారంపై ఆధారపడాలి అని.. ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యదర్శి మోహన్ భాగవత్ అన్నారు.
By Knakam Karthik
వాణిజ్యం ఒత్తిడి లేకుండా ఉండాలి..ఆర్ఎస్ఎస్ చీఫ్ ఆసక్తికర కామెంట్స్
ఢిల్లీ: అంతర్జాతీయ వాణిజ్యం ఒత్తిడిలేని స్వచ్ఛంద సహకారంపై ఆధారపడాలి అని.. ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యదర్శి మోహన్ భాగవత్ అన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ఉత్పత్తులపై 50% టారిఫ్ విధించిన నేపథ్యంలో భాగవత్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన వ్యాఖ్యానమాల కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, “ఆత్మనిర్భర్ అంటే దిగుమతులు పూర్తిగా ఆపేయడం కాదు. ప్రపంచం పరస్పర ఆధారితంగా నడుస్తుంది. కాబట్టి ఎగుమతి–దిగుమతులు కొనసాగుతాయి. కానీ అవి ఒత్తిడిలేని, స్వచ్ఛంద వాణిజ్యంగా ఉండాలి” అని చెప్పారు.
“మన దేశంలో తయారు చేయగలిగినది బయట నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. జీవనానికి అవసరమైనది మన దేశంలో లభించకపోతేనే దిగుమతి చేసుకోవాలి. మనం ఇంట్లోనే నిమ్మరసం చేసుకోగలం. మరి కోకా-కోలా ఎందుకు తాగాలి?” అని భగవత్ ప్రశ్నించారు.
అమెరికా సుంకాల కారణంగా భారత ఎగుమతిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, పలు రంగాలు దెబ్బతింటాయని నిపుణులు చెబుతున్నారు. కొందరు దీన్ని ఒక అవకాశంగా తీసుకొని Ease of Doing Business సులభతరం చేయాలని, కొత్త మార్కెట్లకు ఎగుమతులను మళ్లించాలని సూచిస్తున్నారు.
ఇక ప్రధాని నరేంద్ర మోదీ, స్వదేశీని ప్రోత్సహించే “Vocal for Local” ప్రచారాన్ని బలంగా ముందుకు తీసుకెళ్తున్నారు. గుజరాత్‌లోని హంసల్పూర్ ఫ్యాక్టరీలో మారుతి సుజుకి తొలి ఎలక్ట్రిక్ కారు e-విటారాను ప్రారంభిస్తూ, “భారతదేశంలో తయారైన ఏ వస్తువు అయినా అది స్వదేశీగానే పరిగణించాలి” అని పిలుపునిచ్చారు.