అమానవీయ ఘటన.. వాష్‌రూమ్‌లో రక్తపు మరకలున్నాయని.. బాలికలను వరుస క్రమంలో నిలబెట్టి..
ఓ పాఠశాలలో బాలికలను రుతుక్రమ పరీక్ష కోసం వివస్త్రను చేయించిన అమానవీయ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది.
By Knakam Karthik
వాష్‌రూమ్‌లో రక్తపు మరకలు, పీరియడ్స్‌లో ఉన్నారో, లేరోనని బాలికలను అలా నిలబెట్టి..
ఓ పాఠశాలలో బాలికలను రుతుక్రమ పరీక్ష కోసం వివస్త్రను చేయించిన అమానవీయ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. థానే జిల్లాలోని ఓ ప్రైవేట్ స్కూల్‌లోని బాత్రూమ్‌లో రక్తపు మరకలు కన్పించడంతో వాటికి కారణమైన వారిని తెలుసుకునేందుకు యాజమాన్యం దారుణంగా ప్రవర్తించింది. బాలికలందరినీ వరుస క్రమంలో నిలబెట్టి.. వారి వ్యక్తిగత అవయవాలను టచ్ చేస్తూ పీరియడ్స్‌లో ఉన్నారో, లేదో చెక్ చేయించారు. మంగళవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
అయితే ఆ ప్రైవేటు స్కూల్‌లో టాయిలెట్‌ను శుభ్రం చేస్తుండగా.. పీరియడ్స్ రక్తపు మరకలు కన్పించాయి. దీంతో అక్కడ పనిచేసే సిబ్బంది వాటిని ఫొటోలు తీసి స్కూల్ ప్రిన్సిపల్‌కు పంపించారు. ఆగ్రహం వ్యక్తం చేసిన ఆ ప్రిన్సిపల్.. పాఠశాలలో 5 నుంచి 10వ తరగతి చదువుతున్న బాలికలందరినీ కన్వెన్షన్ హాల్‌కు పిలిపించారు. వారికి ఆ ఫొటోలు చూపించి.. పీరియడ్స్‌లో ఉన్నవారు, లేనివారు రెండు గ్రూప్‌లుగా విడిపోవాలని చెప్పారు. చెప్పినట్లుగానే పీరియడ్స్‌లో ఉన్నవారంతా ఒకవైపు, లేనివారంతా మరోవైపు నిలబడ్డారు. అప్పటికీ నమ్మని ఆ ప్రిన్సిపల్.. మహిళా అటెండెంట్‌ను పిలిపించి పీరియడ్స్‌లో లేమని చెప్పిన విద్యార్థులను చెక్ చేయించారు. ఆ మహిళ వారందరినీ వాష్‌రూమ్‌లోకి తీసుకెళ్లి బాలికల వ్యక్తిగత అవయవాలను చెక్ చేసి నెలసరిలో ఉన్నారో, లేరో నిర్దరించారు.
ఇంటికెళ్లిన తర్వాత ఆ బాలికలు విషయాన్ని తమ తల్లిదండ్రులకు చెప్పడంతో వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. స్కూల్ ముందు నిరసన చేపట్టారు. బుధవారం దీనిపై ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రిన్సిపల్, ప్యూన్, నలుగురు టీచర్లు, ఇద్దరు ట్రస్టీలు.. మొత్తం 8 మందిపై కేసు నమోదు చేశారు. ఇప్పటివరకు ప్రిన్సిపల్, ప్యూన్‌ను అరెస్టు చేయగా, మిగతా వారిని విచారిస్తున్నారు. దీనిపై దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు.