బెంగళూరులో ఓ విచిత్రమైన ఘటన వెలుగులోకి వచ్చింది. 12 ఏళ్ల బాలిక వివాహ రిసెప్షన్ నుండి నేరుగా ఆసుపత్రిలో చేరవలసి వచ్చింది. ఆ అమ్మాయి రిసెప్షన్‌లో స్మోకీ పాన్ తిన్నది. దీన్ని తిన్న కొద్దిసేపటికే అమ్మాయికి తీవ్రమైన కడుపునొప్పి వచ్చింది. క్రమక్రమంగా నొప్పి ఎక్కువ కావడంతో బాలికను వెంటనే ఆసుపత్రిలో చేర్పించారు.
అయితే.. బాలికకు చికిత్స అందించిన వైద్యులు ఆశ్చర్యపోయారు. స్మోకీ పాన్ తిన్న తర్వాత బాలిక కడుపులో రంధ్రం ఏర్పడింది. దీంతో ఆమెకు శస్త్రచికిత్స చేయాల్సి వచ్చింది. నారాయణ మల్టీస్పెషాలిటీ ఆసుపత్రి బాలిక ఎవరనే విషయాన్ని గోప్యంగా ఉంచింది. ఆసుపత్రి ప్రకారం.. బాలిక కడుపులో రంధ్రం (పెర్ఫోరేషన్ పెరిటోనిటిస్) ఉన్నట్లు నిర్ధారణ అయింది, దీని కారణంగా ఆమెకు అత్యవసర శస్త్రచికిత్స జరిగింది.
కడుపు కింది భాగంలో దాదాపు 4x5 సెంటీమీటర్ల రంధ్రం ఉందని.. స్లీవ్ రిసెక్షన్ (కడుపులో కొంత భాగాన్ని తొలగించడం) ద్వారా చికిత్స చేశామని ఆసుపత్రి తెలిపింది. శస్త్రచికిత్స తర్వాత బాలిక రెండు రోజులు ఐసీయూలో ఉండవలసి వచ్చింది. ఆరు రోజుల తర్వాత డిశ్చార్జ్ అయ్యింది.