ఈ కాలం పిల్లలు చిన్న చిన్న విషయాలకు కూడా తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. తల్లిదండ్రులకు అర్థమయ్యేలా చెప్పాల్సింది పోయి.. ఆవేశంతో ప్రాణాలను తీసుకుంటున్నారు. అయితే పెద్దల కూడా పిల్లల అభిరుచిని, ఇష్టాఇష్టాలను తెలుసుకోవాలి. లేదంటే చాలా నష్టపోవాల్సి వస్తుంది. తాజాగా విశాఖ జిల్లా దొండపర్తిలో ఓ బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు.. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఆ తర్వాత దర్యాప్తులో భాగంగా బాలిక ప్రవర్తనపై, బాలిక చదువుకుంటున్న స్కూల్, ఇంట్లో పోలీసులు ఆరా తీశారు. ఓ సాంప్రదాయ నాట్యశాలలో బాలిక కూచిపూడి నృత్యం నేర్చుకునేది.
తల్లిదండ్రులపై గౌరవంతో ఇష్టం లేకున్నా.. రోజూ నృత్యం నేర్చుకోవడానికి వెళ్తుండదని పోలీసులు తెలిపారు. కరోనా విజృంభణ కారణంగా ఆన్‌లైన్‌లో డ్యాన్స్ క్లాసులను హాజరయ్యేది. అయితే మంగళవారం నుండి డ్యాన్స్ క్లాసులు ఆఫ్‌లైన్‌లో ప్రారంభమవుతాయని తెలియడంతో.. డ్యాన్స్ క్లాసులకు వెళ్లడం ఇష్టం లేక.. తీవ్ర మనోవేదనకు గురైంది. డ్యాన్స్ క్లాసులకు వెళ్లకుండా ఉండేందుకు ఏం చేయాలో తెలియక.. రాత్రిపూట అందరూ ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు తెలిపారు. బాలిక మృతదేహానికి పోస్టుమార్టం చేసి.. తల్లిదండ్రులకు అప్పగించామని పోలీసులు చెప్పారు. బాలిక ఆత్మహత్యతో.. ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.