Video: రెప్పపాటులో ప్రమాదం.. కారు మీద పడ్డ పెద్ద బండరాయి

నాగాలాండ్‌ రాష్ట్రంలో మంగళవారం సాయంత్రం 5 గంటల సమయంలో ఒళ్లు గగుర్పొడిచే ఘటన జరిగింది. జోరు వర్షంలో ఘోర ప్రమాదం జరిగింది.

By అంజి  Published on  5 July 2023 6:44 AM GMT
Landslide, Nagaland, car crush, National news

Video: రెప్పపాటులో ప్రమాదం.. కారు మీద పడ్డ పెద్ద బండరాయి

నాగాలాండ్‌ రాష్ట్రంలో మంగళవారం సాయంత్రం 5 గంటల సమయంలో ఒళ్లు గగుర్పొడిచే ఘటన జరిగింది. జోరు వర్షంలో ఘోర ప్రమాదం జరిగింది. కొండ చరియలు విరిగిపడటంతో నేషనల్‌ హైవేపై వెళ్తున్న వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. అంతలోనే ఓ పెద్ద బండరాయి రూపంలో మృత్యువు దూసుకొచ్చింది. కొండపై నుంచి భారీ రాయి దొర్లుకుంటూ వచ్చి కారు మీద పడింది. దీంతో కారు పూర్తిగా నుజ్జు నుజ్జైంది. ఆ తర్వాత కారు దొర్లుకుంటూ వచ్చి మరో కారును ఢీకొట్టింది. దీంతో ఆ కారు కూడా పూర్తిగా ధ్వంసమైంది.

కారు లోపల ఉన్నవారిలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మరో ప్రయాణికుడు కారు, బండరాయి మధ్య చిక్కుకుపోయాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. దీనికి సంబంధించిన దృశ్యాలన్నీ కారు వెనుక ఆగిన ఉన్న మరో కారు డ్యాష్‌ బోర్డ్‌ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. నేషనల్‌ హైవే -29పై దిమాపూర్‌, కోహిమా పట్టణాల మధ్య పాకాల పహర్‌ అనే ఏరియాలో ఈ ప్రమాదం జరిగింది.

కొండను ఆనుకుని ఈ రహదారిని నిర్మించారు. ఇలా వర్షాలు పడే సమయంలో తరచూ కొండచరియలు విరిగిపడుతుంటాయని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంపై నాగాలాండ్ సీఎం నిపూ రియో స్పందించారు. బాధిత కుటుంబాలకు సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ.4 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. పాకాల పహర్ ప్రాంతంలో వాహనదారుల భద్రతకు అవసరమైన ఏర్పాట్లు చేస్తామని సీఎం హామీ ఇచ్చారు.

Next Story