జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, ప్రముఖ రాజకీయ నేత గులాంనబీ అజాద్ కొత్త పార్టీని ప్రకటించారు. 'డెమొక్రటిక్ ఆజాద్ పార్టీ' గా తన కొత్త పార్టీకి పేరును నిర్ణయించారు. పార్టీ జెండాను కూడా ఆయన ఆవిష్కరించారు. కాంగ్రెస్ పార్టీని వీడిన నెల రోజుల తర్వాత ఆయన సొంత పార్టీని స్థాపించారు. "నా కొత్త పార్టీ కోసం దాదాపు 1,500 మంది పేర్లను ఉర్దూ, సంస్కృతంలో మాకు పంపారు. హిందీ, ఉర్దూ మిశ్రమం 'హిందూస్థానీ'. పేరు ప్రజాస్వామ్యంగా, శాంతియుతంగా మరియు స్వతంత్రంగా ఉండాలని మేము కోరుకుంటున్నాము" అని ఆయన అన్నారు. తమకంటూ స్వతంత్ర ఆలోచన, సిద్ధాంతాలు ఉంటాయని అజాద్ ప్రకటించారు. తమది ప్రజాస్వామ్య పార్టీ అవుతుందని.. ఎన్నికల సంఘం వద్ద పార్టీని నమోదు చేసుకోబోతున్నామన్నారు. ఎన్నికలు ఎప్పుడైనా జరగొచ్చనీ, తమ రాజకీయ కార్యకలాపాలు కొనసాగుతాయనీ అన్నారు. నీలం, తెలుపు, పసుపు రంగుల కలయికతో అజాద్ పార్టీ జెండా రూపుదిద్దుకుంది.
ఆదివారం తమ కార్యకర్తలు, నాయకులతో ఆజాద్ సమావేశాలు నిర్వహించిన అనంతరం ఈ ప్రకటన వెలువడింది. 73 ఏళ్ల గులాం అజాద్ ఆగస్టు 26న కాంగ్రెస్‌ను విడిచిపెట్టి, కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై కూడా ఆయన విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ నుండి వైదొలిగిన తర్వాత జమ్మూలో తన మొదటి బహిరంగ సభలో తన సొంత రాజకీయ పార్టీని ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. అజాద్‌కు మద్దతుగా మాజీ ఉప ముఖ్యమంత్రి తారా చంద్, పలువురు మాజీ మంత్రులు, శాసనసభ్యులు సహా రెండు డజన్ల మంది ప్రముఖ కాంగ్రెస్ నేతలు కూడా కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు.