వ్యాక్సిన్ వేయించుకో.. గిప్ట్‌లు గెలుచుకో అంటోంది మహారాష్ట్రలోని చంద్రాపూర్ మున్సిపల్ కార్పొరేషన్ యంత్రాంగం. కరోనా వ్యాక్సినేషన్‌కు సంబంధించి స్థానిక మేయర్ రాఖీ సంజయ్ కంచరల్వార్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. వ్యాక్సిన్ వేసుకున్న పౌరులకు బహుమతులు అందించాలని నిర్ణయించారు. వ్యాక్సిన్ వేసుకున్న వారి పేర్లను లక్కీ డ్రా తీసి విజేతలను ప్రకటించి.. వారికి బహుమతులు ఇవ్వనున్నారు. రేపటి నుండి ఈ నెల 24వ వరకు వ్యాక్సిన్ తీసుకునే వారికి బహుమతులు గెలుచుకునే ఛాన్స్ ఉందని మున్సిపల్ కార్పొరేషన్ ఒక ప్రకటన విడుదల చేసింది. స్థానిక ఆరోగ్య కేంద్రాలకు వెళ్లి ప్రజలు వ్యాక్సిన్ వేయించుకోవాలని కమిషనర్ రాజేష్ మోహితే విజ్ఞప్తి చేశారు.
లక్కీ డ్రా గెలుపొందిన వారికి ఫస్ట్ ప్రైస్‌గా రిఫ్రిజిరేటర్, సెంకడ్ ప్రైస్‌గా వాషింగ్ మిషన్, థర్డ్ ప్రైస్‌గా ఎల్‌ఈడీ టీవీ ఇస్తున్నట్లు చెప్పారు. మరో 10 మందికి మిక్సర్ - గ్రైండర్ల బహుమతులను ఇవ్వనున్నట్లు చెప్పారు. ఎమర్జెన్సీ సేవల విభాగంలో పని చేసేవారితో పాటు షాపుల నిర్వాహకులు కచ్చితంగా ఒక డోస్ వ్యాక్సిన్ తీసుకున్న సర్టిఫికెట్ చూపించాల్సి ఉంటుంది. లేదంటే వారిని నగరంలోని మార్కెట్‌లోకి అనుమతించమని అధికారులు చెప్పారు. ఈ నెలాఖరులోపు రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకొవాలి. బయటకి వెళ్లేటప్పుడు కూడా వ్యాక్సిన్ సర్టిఫికెట్‌ను వెంట తెచ్చుకోవాలని కమిషన్ సూచించారు. ఇప్పటికే పలు చోట్ల కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలని.. లేదంటే ఉద్యోగాలు పోతాయంటూ కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. మరీ ఈ బహుమతుల కోసమైన అక్కడి స్థానిక పౌరులు వ్యాక్సిన్ వేయించుకుంటారో లేదో చూడాలి.